వ్యవసాయ చట్టాల అమలు: ఒక్క ఏడాది చూడండి..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలు ఎలా ఉంటుందో ఒక్క సంవత్సరం చూడాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు.

Published : 25 Dec 2020 14:39 IST

రైతులకు సూచించిన కేంద్ర మంత్రులు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలు ఎలా ఉంటుందో ఒక్క సంవత్సరం చూడాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అప్పటికీ రైతులకు ప్రయోజనం లేదని గుర్తిస్తే వాటిని సవరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. నిరసనల్లో పాల్గొన్న వారు రైతు కుటుంబాలకు చెందినవారని..వారిపై తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. రైతులకు ప్రయోజనం లేని ఎటువంటి నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకోదని దిల్లీలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. సమస్యలన్నింటినీ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని.. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కోరుకుంటున్నారని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రభుత్వంతో చర్చలకు రైతులు ముందుకురావాలని కోరారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతోన్న నేపథ్యంలో వాటిపై అవగాహన కల్పించేందుకు కేంద్రమంత్రులు భారీ స్థాయిలో ర్యాలీలు చేపడుతోన్న విషయం తెలిసిందే.

రైతు భూమిని ఎవ్వరూ కాజేయలేరు.. అమిత్‌ షా
దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నంత వరకూ ఏ ఒక్క రైతు భూమిని ఎవ్వరూ కాజేయలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టంచేశారు. నూతన చట్టాలతోనూ రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర కొనసాగుతుందని.. మండీలు కూడా మూతపడవని పేర్కొన్నారు. దిల్లీ కిషన్‌గఢ్‌ ప్రాంతంలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే.. వాటిపై చర్చించి, రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమిత్‌షా స్పష్టంచేశారు. కనీస మద్దతు ధరపై విపక్షాలు చేస్తోన్న అసత్య వార్తలపై అమిత్‌ షా మండిపడ్డారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర విషయంలో కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. పంటలకు మద్దతు ధర పెరుగుదలపై ఎంతో కాలంగా ఉన్న డిమాండ్‌లను 2014-19 మధ్యకాలంలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేర్చిందని అమిత్‌ షా గుర్తుచేశారు. ఇదిలాఉంటే, రైతుల నిరసనలు కొనసాగుతోన్న వేళ.. వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరి రైతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా మాట్లాడారు.

ఇవీ చదవండి.. 
రైతుల జీవితాలతో ఆడుకోవద్దు: మోదీ
చట్టాల్ని రద్దుచేసే దాకా..ఉద్యమం ఆపరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని