ఉగ్ర జాబితా నుంచి 4వేల మందిని తొలగించిన పాక్!‌

ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూకశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారత్‌ మరోసారి ధీటైన జవాబిచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ, ఉగ్ర మూకలకు మద్దతుగా పాకిస్థాన్‌ పోషిస్తున్న పాత్రను ఐరాస మానవ హక్కుల మండలి ముందు బట్టబయలు చేసింది.

Published : 29 Sep 2020 01:23 IST

ఐరాసలో పాక్‌కు ధీటుగా బదులిచ్చిన భారత్‌

దిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూకశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారత్‌ మరోసారి ధీటైన జవాబిచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ, ఉగ్ర మూకలకు మద్దతుగా పాకిస్థాన్‌ పోషిస్తున్న పాత్రను ఐరాస మానవ హక్కుల మండలి ముందు బట్టబయలు చేసింది. అంతేకాకుండా మైనారిటీల విషయంలో పాక్‌ అనుసరిస్తున్న తీరును కూడా భారత్‌ ఎండగట్టింది. ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాటంలో నిమగ్నమై ఉంటే పాక్‌ మాత్రం 4వేల మంది ఉగ్రవాదులను జాబితా నుంచి తొలగించి, వారికి స్వర్గధామంగా మారిందని ఆదేశానికి  బదులిచ్చింది. ఈ మేరకు ఐరాసలో భారత ప్రతినిధి పవన్‌ బాదే సమావేశంలో ప్రసంగించారు. 

‘భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం కోసం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారీ స్థాయిలో ఉగ్ర శిక్షణ శిబిరాలు, ఉగ్ర స్థావరాలు విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయి. ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాటంలో నిమగ్నమై ఉంటే.. పాక్‌ మాత్రం ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించేందుకు గానూ 4వేల మందికి పైగా అంతర్జాతీయ ఉగ్రవాదులను జాబితా నుంచి తొలగించింది’ అని పవన్‌ బాదే తెలిపారు. కాగా పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌(ఆర్థిక చర్యల కార్యదళం)లో బ్లాక్‌ లిస్టులో చేర్చాలా వద్దా అనే అంశంపై అక్టోబర్‌లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం పాక్‌ ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో ఉంది.  

ఐరాసలో జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన ఇమ్రాన్‌ ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు దక్షిణాసియాలో శాంతి నెలకొనదని ఆరోపించారు. దీంతో భారత్‌ స్పందిస్తూ.. పాకిస్థాన్‌ బయటి నుంచి పీఓకేలోకి వ్యక్తుల్ని పంపించి అక్కడి జనాభాను మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. పీఓకేలో ఉండే ప్రతి నలుగురిలో ముగ్గురు బయటి నుంచి వచ్చిన వారే ఉంటారని పేర్కొంది. ఇదంతా పాక్‌ చేస్తున్న కుట్రగానే భారత్‌ తిప్పికొట్టింది. అంతేకాకుండా పాక్‌ను మైనార్టీల హత్యా క్షేత్రంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయని.. ప్రతి సంవత్సరం వందలాది మైనారిటీలు అక్కడ హింసకు గురవుతూనే ఉన్నారని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు