సెక్ష‌న్ 80సీతో పాటు మ‌రికొన్ని ప‌న్ను మిన‌హాయింపు మార్గాలు

మీ కుటుంబ స‌భ్యుల‌ కోసం చేసే వ్య‌యాల‌కు, పెట్టుబ‌డుల‌కు సెక్ష‌న్‌ 80సీ నుంచి 80యూ వ‌ర‌కు వివిధ ప‌న్నుమిన‌హాయింపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఉండే అల‌వెన్సులు, వ్య‌యాలు, పెట్టుబ‌డులు, కాంట్రీబ్యూష‌న్‌లు వంటి వాటిపై ..

Updated : 25 Dec 2020 14:26 IST

మీ కుటుంబ స‌భ్యుల‌ కోసం చేసే వ్య‌యాల‌కు, పెట్టుబ‌డుల‌కు సెక్ష‌న్‌ 80సీ నుంచి 80యూ వ‌ర‌కు వివిధ ప‌న్నుమిన‌హాయింపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఉండే అల‌వెన్సులు, వ్య‌యాలు, పెట్టుబ‌డులు, కాంట్రీబ్యూష‌న్‌లు వంటి వాటిపై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం వేరు వేరు విభాగాల నుంచి ల‌భించే ప్ర‌యోజ‌నాల‌పై ప‌న్ను చెల్లింపు దారులకు కొంత అవ‌గాహ‌న ఉంటుంది. అయితే పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు, మీపై ఆధార‌ప‌డిన కుటుంబ‌ స‌భ్యుల కోసం ఖ‌ర్చులు, పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఈ కింది సెక్ష‌న్‌ల ద్వారా కూడా మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

సెక్ష‌న్ 80సీ: మీ జీవిత భాగ‌స్వామి, పిల్ల‌ల కోసం చేసిన పెట్టుబ‌డుల‌కు సెక్ష‌న్ 80సీ కింద ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజులు - భార‌త‌దేశంలో ఉన్న ఏదైనా పాఠశాల‌, క‌ళాశాల, విశ్వ‌విద్యాల‌యం, ఇత‌ర విద్యాసంస్థ‌ల ప్ర‌వేశ‌స‌మ‌యంలో గానీ, పూర్తి స్థాయి విద్య కోసం గానీ చెల్లించే ట్యూష‌న్ ఫీజులకు (అభివృద్ది రుసుములు, విరాళాలు వంటివి మిన‌హాయించి) ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఒక ఆర్థ‌క సంవ‌త్స‌రంలో ఇద్ద‌రు పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజుల‌పై మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల యాన్యూటీ కోసం గానీ, అత‌ను/ ఆమె జీవిత భాగ‌స్వామి, పిల్ల‌ల‌కు భ‌విష్య‌త్తు నిధిని ఏర్పాటు చేసేందుకు ఉద్యోగి జీతం నుంచి డిడ‌క్ట్ చేసే 20 శాతంపై సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.
ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌వేశ‌పెట్టిన సుక‌న్య స‌మృద్ది యోజ‌న ప‌థ‌కంలో గ‌రిష్టంగా ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల పేర్ల‌పై పెట్టుబ‌డి పెట్టడం ద్వారా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

సెక్ష‌న్ 80డీ:మీతో పాటు మీ భార్య పిల్ల‌ల పేర్ల‌పై చెల్లించే ఆరోగ్య బీమా పాల‌సీల‌ ప్రీమియం (న‌గ‌దు ర‌హిత చెల్లింపుల‌కు) రూ. 25 వేలు, ఒక‌వేళ మీ జీవిత భాగ‌స్వామి సీనియ‌ర్ సిటిజ‌న్ అయితే రూ. 50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. త‌ల్లిదండ్రుల ఆరోగ్య బీమా పాల‌సీల ప్రీమియంపై అద‌నంగా రూ. 25 వేలు, త‌ల్లిదండ్రులు సీనియ‌ర్ సిటిజ‌న్లు అయితే రూ. 50 వేల వ‌ర‌కు ప‌న్ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వ ఆరోగ్య బీమా ప‌థ‌కం (సీజీహెచ్ఎస్‌), ప్రీవెంటీవ్ హెల్త్ చెక‌ప్ కోసం చేసే చెల్లింపులపై ప్ర‌భుత్వ ఉద్యోగులు అద‌నంగా రూ. 5 వేలు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

సెక్ష‌న్ 80డీడీ: కుటుంబంలో మీపై ఆధార‌ప‌డి జీవిస్తున్న అంగవైక‌ల్యం ఉన్న వ్య‌క్తి ఉంటే, వారి వైద్యానికి (న‌ర్సింగ్‌తో స‌హా), శిక్ష‌ణ వంటి వాటికి అయ్యే వ్య‌యం, నిర్థిష్ట ప‌థ‌కంలో వారి కోసం చేసే చెల్లింపులు లేదా డిపాజిట్లు వంటి వాటిపై రూ. 75 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

సెక్ష‌న్ 56(4) లో వివ‌రించిన‌ట్లుగా 80 శాతం, అంత‌కంటే ఎక్కువ శాతం తీవ్ర వైక‌ల్యంతో, ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ వైక‌ల్యాల‌తో ( అంధ‌త్వం, మానిసిక ప‌రిప‌క్వ‌త లేక‌పోవ‌డం వంటి వాటితో స‌హా) భాద‌ప‌డుతున్న‌ట్లు వైద్యుడు నిర్ధారించిన కుటుంబ స‌భ్యుని విష‌యంలో రూ. 1.25 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

సెక్ష‌న్ 80డీడీబీ: నిర్ధిష్ట వ్యాధుల వైద్య ఖ‌ర్చుల‌కు గ‌రిష్టంగా రూ. 40 వేల వ‌ర‌కు ఈ సెక్ష‌న్ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. సీనియ‌ర్‌, సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ. 1 లక్ష వ‌ర‌కు మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. నిబంధ‌న 11డీడీలో పేర్కొన్న వ్యాధులకు మాత్ర‌మే ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. ఇందుకు గానూ ఫారం 10 (I) స‌ర్టిఫికేట్‌ను ప్ర‌భుత్వ ఆసుప్ర‌తిలో ప‌నిచేస్తున్న వైద్యుడు ఇవ్వాల్సి ఉంటుంది.

సెక్షన్ 80ఈ: విద్య రుణంపై చెల్లించిన వడ్డీ- త‌మ‌ విద్యకు , జీవిత భాగస్వామి లేదా పిల్లల విద్యకు తీసుకున్న రుణంపై చెల్లించిన వడ్డీపై సెక్ష‌న్ 80ఈ కింద ప‌న్నుమిన‌హాయింపు క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత ల‌భిస్తుంది.రుణాన్ని తిరిగి చెల్లించటం మొదలుపెట్టిన సంవత్సరం నుంచి ఎనిమిది సంవత్సరాలపాటు చెల్లించిన మొత్తం వడ్డీ మీద మినహాయింపు పొందవచ్చు. అస‌లు మొత్తంపై ప‌న్ను మినహాయింపు వ‌ర్తించ‌దు. ఈ ప‌న్ను మిన‌హాయింపు పొందేంద‌కు , ప్రతి సంవత్సరం రుణదాత నుంచి రుణ చెల్లింపు సర్టిఫికేట్ పొందాలి.

సెక్ష‌న్ 80యూ: ఆదాయ‌పు ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే వ్య‌క్తి స్వ‌యంగా వైక‌ల్యంతో భాద‌ప‌డుతుంటే ఈ సెక్ష‌న్ కింద రూ.75 వేలు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. తీవ్ర వైక‌ల్యానికి గురైతే పైన వివ‌రించిన సెక్ష‌న్ 80డీడీ ప్ర‌కారం రూ. 1.25 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

అల‌వెన్సులు: పైన తెలిపిన సెక్ష‌న్ల‌తో పాటు స్థూల ఆదాయం లోని ఈ కింది అల‌వెన్సుల నుంచి కూడా మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.
పిల్ల‌ల విద్య అల‌వెన్సు: ఒక సంతానానికి నెల‌కు రూ. 100 చొప్పున గ‌రిష్టంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది.
హాస్టల్ ఖ‌ర్చుల అల‌వెన్సు: ఒక సంతానానికి నెల‌కు రూ. 300 చొప్పున గ‌రిష్టంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని