Published : 04 Sep 2020 01:35 IST

ప్రాణాలు కాపాడుతోన్న స్టెరాయిడ్లు!

వైరస్‌‌ తీవ్రత అధికంగా ఉన్న రోగుల్లో మెరుగైన ఫలితాలు
సిఫార్సు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

వాషింగ్టన్‌: మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు ఇప్పటికీ కచ్చితమైన చికిత్స లేదు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్, ఔషధాల‌ కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది. అయితే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్‌ రోగులను రక్షించేందుకు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న వివిధ రకాల మందులను వాడుతున్నారు. వీటిలో చౌకగా లభించే కార్టికో స్టెరాయిడ్‌ మాత్రలు ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడుతున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై జరిగిన ఏడు పరిశోధనల ఫలితాలను విశ్లేషించిన అనంతరం ప్రాణాపాయస్థితిలో ఉన్న కొవిడ్‌ రోగుల ప్రాణాలను కాపాడటంలో కొంతవరకు స్టెరాయిడ్లు పనిచేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. వెంటిలేటర్‌ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులకు ఇవి ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసింది.

కరోనావైరస్‌ చికిత్సలో భాగంగా ఇప్పటికే మలేరియాకు వాడే మందులతో సహా మరికొన్ని స్టెరాయిడ్లను కూడా అందిస్తున్నారు. అదే సమయంలో కొవిడ్‌ వైరస్‌ను ఈ మందులు ఎంతవరకు ఎదుర్కొంటున్నాయనే విషయంపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కార్టికో స్టెరాయిడ్లు ప్రాణాపాయస్థితి నుంచి కొవిడ్‌ రోగుల ప్రాణాలు కాపాడుతున్నట్లు తాజా పరిశోధనల్లో గుర్తించారు. దీన్ని జర్నల్‌ ఆఫ్‌ అమెరికా మెడికల్‌ ఆసోసియేషన్‌(జామా) కూడా ప్రచురించింది. ముఖ్యంగా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న (ఆక్సిజన్‌ సహాయం అవసరమయ్యే) రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నట్లు నిపుణులు తేల్చారు. వీటిలో హైడ్రోకార్టిసోన్, డెక్సామెథాసోన్, మిథైల్ ‌ప్రెడ్నీసొలోన్‌ వంటి కార్టికో స్టెరాయిడ్ మాత్రలు తక్కువ డోసులో ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న కొవిడ్‌ రోగులు స్టెరాయిడ్లు వాడవచ్చని సిఫార్సు చేసింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాలు మెరుగైన ఫలితాలు ఇవ్వడం ఊరటకలిగించే విషయమని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన డాక్టర్‌ మార్టిన్‌ లాండ్రీ పేర్కొన్నారు. వ్యాధిని పూర్తిగా నయం చేయకపోయినప్పటికీ..తక్కువ ఖర్చులో లభించే ఈ స్టెరాయిడ్లు ఆశాజనక ఫలితాలు ఇవ్వడం ఎంతో ఉపశమనం కలిగించే విషయమని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన డాక్టర్‌ ఆంథోని గార్డన్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ తాజా ఫలితాలు కొవిడ్‌ చికిత్సలో మరో మైలురాయి అని అభివర్ణించారు. ముఖ్యంగా శ్వాసకోస భాగాల్లో ఏర్పడే వాపులను నియంత్రించి, రోగి ప్రాణాలను కాపాడటంలో ఈ స్టెరాయిడ్లు బాగా పనిచేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. బ్రిటన్, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, అమెరికా దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వచ్చాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే స్వల్ప లక్షణాలున్న వారు ఈ స్టెరాయిడ్లు వాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా రోగులను ప్రాణాలను రక్షించడంలో డెక్సామెథాసోన్‌ కీలకంగా పనిచేస్తున్నట్లు ఇదివరకే యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ జరిపిన పరిశోధనల్లో తేలింది. ఆక్సిజన్‌ అవసరమవుతున్న కొవిడ్‌ రోగులకు ఈ మందులు వాడడంతో దాదాపు 35శాతం మంది రోగులు మరణాల నుంచి బయటపడుతున్నట్లు గుర్తించారు. మరో ఔషధం రెమిడెసివిర్‌ కూడా వాడవచ్చని ఇప్పటికే అమెరికా మందుల నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. వీటితోపాటు అత్యవసర సమయాల్లో స్టెరాయిడ్ల వాడకానికి ఆయా దేశాలు అనుమతిస్తున్నాయి.

ఇవీ చదవండి..
భారత్‌లో కరోనా కల్లోలం: రికార్డుస్థాయి కేసులు
నవంబర్‌ 1 కల్లా అమెరికాలో వ్యాక్సిన్‌ సిద్ధం!

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని