Supreme Court: ‘ఎమ్మెల్యేల అనర్హత’పై నాన్చుడెందుకు?

లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నందుకు మణిపుర్‌లో 12 మంది భాజపా శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే అంశంపై...

Updated : 10 Nov 2021 11:44 IST

మణిపుర్‌ గవర్నర్‌ తీరును ప్రశ్నించిన సుప్రీం

దిల్లీ: లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నందుకు మణిపుర్‌లో 12 మంది భాజపా శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే అంశంపై రాష్ట్ర గవర్నర్‌ ఎటూ తేల్చకపోవడంపై సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం (ఈసీ) తన అభిప్రాయాన్ని వెల్లడించినా.. గవర్నర్‌ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోకపోవడాన్ని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్లో కొనసాగుతున్న 12 మంది భాజపా ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2018లో కరాంగ్‌ ఎమ్మెల్యే డి.డి.తైసిల్‌ తదితరులు పిటిషన్‌ వేశారు. మణిపుర్‌లో అమలులో ఉన్న రెండు చట్టాలు ఇచ్చిన మినహాయింపు వల్లనే వారు పార్లమెంటరీ కార్యదర్శులుగా కూడా కొనసాగగలిగారు. కాబట్టి వారిపై అనర్హత వేటు వేయడానికి ఈసీ నిరాకరించింది. అనంతరం రాష్ట్ర హైకోర్టు ఆ రెండు చట్టాలనూ కొట్టివేసింది. దీంతో 12 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని మణిపుర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర గవర్నర్‌ నజ్మా హెప్తుల్లాకు విన్నవించింది. దీనిపై గవర్నర్‌ నిరుడు అక్టోబరులో మళ్లీ ఈసీ అభిప్రాయం కోరారు. ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శి పదవిలో నియమితులైనప్పుడు, పైన చెప్పుకొన్న రెండు చట్టాలూ అమలులో ఉన్నందున, వారిని అనర్హులుగా పరిగణించలేమని ఈసీ జనవరి 13న గవర్నర్‌కు తెలిపింది. దీనిమీద తన నిర్ణయమేమిటో తెలపకుండా గవర్నర్‌ నానబెడుతున్నారని పిటిషన్‌దారు తైసిల్‌ సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. మణిపుర్‌ శాసనసభ పదవీ కాలం మరో నెలలో ముగియనుందనీ, ఆలోగా గవర్నర్‌ ఏమీ తేల్చకపోతే పిటిషన్‌ మురిగిపోతుందని గుర్తుచేశారు. అయితే, సొలిసిటర్‌ జనరల్‌ వేరే ధర్మాసనం ముందు మరో కేసు వాదిస్తున్నందున ఎమ్మెల్యేల కేసును వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో ధర్మాసనం విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని