Published : 04 Oct 2020 18:40 IST

భద్రతా బలగాలకు కొత్త తలనొప్పి!

వర్చువల్‌ సిమ్‌కార్డులతో సవాల్‌ విసురుతున్న ఉగ్రవాదులు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోయలో ఉగ్రమూలాలను చెరిపేసేందుకు భద్రతా బలగాలు చేస్తున్న ప్రయత్నాలకు కొత్త కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయి. ఉగ్రవాదులు కొత్త ఎత్తులు వేస్తూ మన బలగాలకు సవాళ్లు విసురుతున్నారు. తమ ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున వర్చువల్‌ సిమ్‌ కార్డులు వినియోగిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ముఠా నాయకులతో అనుసంధానమై దేశంలో విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో వీటి వినియోగం భారీగా పెరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.

విదేశాల్లో ఉండే సర్వీసు ప్రొవైడర్లు ఈ సిమ్‌కార్డులను జారీ  చేస్తున్నాయి. కంప్యూటర్‌ ద్వారా టెలిఫోన్‌ నంబర్‌ జనరేట్‌ అవుతుంది. సర్వీసు ప్రొవైడర్‌కు చెందిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఉగ్రవాదులు ఆ నంబర్‌ను వినియోగించుకోగలుగుతున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలతో అనుసంధానమవుతున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఇజ్రాయెల్‌ తదితర దేశాలకు చెందిన ఇటువంటి నంబర్లు ఎక్కువగా మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. 

వినియోగం అప్పటి నుంచే..

ఈ కొత్త తరహా సాంకేతికతను ఉగ్రవాదులు వినియోగిస్తున్నారన్న విషయం గతేడాది వెలుగులోకి వచ్చింది. పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ వర్చువల్‌ సిమ్‌ కార్డును వినియోగించినట్లు ఆధారాలు లభించాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం అమెరికాను సంప్రదించాయి. ఈ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఒక్క పుల్వామా ఉగ్రదాడి ఘటనకు దాదాపు 40 వర్చువల్‌ సిమ్‌ కార్డులను వినియోగించినట్లు విచారణలో తేలింది.

గుర్తించడం ఈజీ కాదు..

వర్చువల్‌ సిమ్‌ కార్డుల గుర్తింపు అంత సులువు కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక మొబైల్‌లో వర్చువల్‌ సిమ్‌ కార్డు వినియోగించారో లేదో తెలుసుకోవాలంటే ఆ మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ అనాలసిస్‌కు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆనవాళ్లు గుర్తించినా చివరికి చిక్కేది అమాయకులే.  2008లో జరిగిన 26/11 ఉగ్రదాడి సమయంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అప్పట్లో వీవోఐపీ సాంకేతికతను యాక్టివేట్‌ చేసేందుకు కాల్‌ఫొనెక్స్‌కు ఇటలీలో జావేద్‌ ఇక్బాల్‌ పేరుతో నడుస్తున్న మదీనా ట్రేడింగ్‌ నుంచి చెల్లింపులు జరిగాయి. అయితే, 2009లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఇటలీ పోలీసులు అరెస్ట్‌ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్బాల్‌ అనే వ్యక్తి గతంలో ఎప్పుడూ ఇటలీలో అడుగుపెట్టలేదని తేలింది. అమాయకులు, గుర్తింపు కార్డులు పోగొట్టుకున్న వారి పేరుతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని