Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్‌

Liquor Policy Case: దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది.

Updated : 19 Mar 2024 11:06 IST

దిల్లీ: దిల్లీ మద్యం విధానం (Delhi Liquor Policy Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు తమ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. ఈ దర్యాప్తు సంస్థ భాజపా పొలిటికల్‌ వింగ్‌లా పనిచేస్తోందని మండిపడింది.

2021-22 దిల్లీ మద్యం విధాన రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి భారాస ఎమ్మెల్సీ కవిత, అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా తదితరులు కుట్ర పన్నారని ఈడీ తమ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆ పార్టీ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆప్‌ నేతలు మనీశ్‌ సిసోదియా, సంజయ్‌సింగ్‌ అరెస్టు విషయాన్ని ఇందులో ప్రస్తావించింది.

ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర

దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ‘‘గతంలోనూ ఈడీ ఇలాంటి అవాస్తవ ప్రకటనలు విడుదల చేసింది. ఈ కేసులో 500లకు పైగా సోదాలు జరిపినా.. వేల మంది సాక్ష్యులను విచారించినా దర్యాప్తు సంస్థకు అక్రమంగా ఉన్నట్లు నిరూపించేలా ఒక్క రూపాయి కూడా లభించలేదు. చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలేదు. అందుకే విసుగెత్తిపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఒక్క కొత్త విషయం లేదు. ఇవన్నీ చూస్తుంటే కేసులో తటస్థ దర్యాప్తు విధానాన్ని వదిలేసి.. భాజపాకు పొలిటికల్‌ వింగ్‌లా ఈడీ పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు’’ అని ఆ పార్టీ మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని