Published : 18 Jan 2021 01:04 IST

అఫ్గాన్‌ కార్లకు ‘39’ నంబర్‌ ఉండబోదు.. ఎందుకంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేసే సమయంలో రోడ్డు ట్రాన్స్‌పోర్టు సంస్థ నంబర్‌ కేటాయిస్తుంటుంది. అవి కాకుండా తమకు నచ్చిన నంబర్‌ కేటాయించాలంటూ వాహనదారులు భారీగా డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ, అఫ్గానిస్థాన్‌లో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఏ నంబర్‌ ఇచ్చినా పర్వాలేదు ‘39’ నంబర్‌ను మాత్రం ఇవ్వకండి అని ఆర్‌టీఏ అధికారులను కోరుతున్నారు. ఆ నంబర్‌ కేటాయించొద్దని అధికారులకు లంచాలు కూడా ఇస్తున్నారట అక్కడి ప్రజలు. గత కొన్నేళ్లుగా అఫ్గానీయులు ఆ నంబర్‌ను చూస్తే జంకుతున్నారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం ఏకంగా వాహనాలకు కేటాయించిన ‘39’ సిరీస్‌ నంబర్లను తొలగించాలని నిర్ణయానికి వచ్చేసింది. ఇంతకీ ఆ నంబరంటే వారికి ఎందుకంతా భయం?

అఫ్గానిస్థాన్‌లో ‘39’ నంబర్‌తో కూడిన వాహనం కనిపించినా, మొబైల్‌ నంబర్‌ ఉన్నా వాటి యజమానులకు తీవ్ర అవమానాలు ఎదురవుతాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు ‘39’ నంబర్‌ను ఒక అసహ్యమైన నంబర్‌గా భావిస్తారు. దీని వెనుక పలు వాదనలు ఉన్నాయి. దేశంలోని హేరట్‌ అనే నగరంలో వేశ్యలతో వ్యభిచార గృహాలను నిర్వహించే ఒక క్రూరమైన వ్యక్తి ఉంటున్నాడట. అతడిని ‘39’ అని పిలుస్తుంటారు. అతడు వినియోగించే కార్ల నంబర్‌ప్లేట్లలోనూ 39 ఉంటుంది. అయితే, అఫ్గాన్‌లో వ్యభిచారం చేయడం, వేశ్యగా మారడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. దీంతో వ్యభిచారం నిర్వహించే వారు ఉపయోగిస్తున్న కార్ల నంబర్లను సామాన్య ప్రజలు వినియోగించడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడైనా ఆ నంబర్‌ ఉన్న కార్లలో అమ్మాయిలు వెళ్తే ఆకతాయిలు వెంటపడటం, మరికొందరు దూషించడం చేస్తుంటారట. అలా ‘39’ను అసహ్యించుకోవడం హేరట్‌ నగరంలో ప్రారంభమై దేశమంతటా వ్యాపించింది. ఆ నంబర్‌ కలిగి ఉన్నారంటే వారు వ్యభిచారం చేసేవాళ్లు, చేయించేవాళ్లు అని ముద్ర వేసేశారు.

అయితే, కొన్నాళ్ల కిందట దేశంలోని వాహనాల రిజిస్ట్రేషన్‌ ఐదు డిజిట్ల నంబర్‌ సిరీస్‌ 38 నుంచి 39కి సిరీస్‌కి మారింది. దీంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. అవమానాలు భరించలేక చాలా మంది ఆ నంబర్‌ ఉన్న వాహనాలను సెకెండ్‌హ్యాండ్‌ కార్ల సంస్థలకు తక్కువ ధరకే అమ్మేసుకున్నారు. అయితే, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావట్లేదు. కొత్తగా వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో 39 సిరీస్‌ నంబర్‌ కేటాయించొద్దని అధికారులకు ప్రజలు లంచాలు కూడా ఇస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వాహనాల రిజిస్ట్రేషన్లలో ఆ సిరీస్‌ను తొలగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. త్వరలో  సిస్టమ్‌లో 39 నంబర్‌ను పూర్తిగా తొలగించనున్నారు.

ఇవీ చదవండి..

మహీంద్రా బంపర్‌ ఆఫర్‌..!

మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని