Gen Naravane: రావత్‌ స్థానంలో సీవోఎస్‌సీ ఛైర్మన్‌గా నరవణె

త్రివిధ దళాల అధిపతుల(చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్ ‌- CoSC) కమిటీ ఛైర్మన్‌గా సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న

Updated : 16 Dec 2021 12:03 IST

దిల్లీ: త్రివిధ దళాల అధిపతుల(చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్ ‌- CoSC) కమిటీ ఛైర్మన్‌గా సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవల ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో నరవణెను నియమించారు. త్రివిధ దళాల అధిపతుల్లో ఆయనే సీనియర్‌ కావడంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) పదవిని సృష్టించక ముందు వరకు ఈ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ(సీవోఎస్‌సీ)కి త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్‌ అయిన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించేవారు. సీడీఎస్‌ నియామకం తర్వాత నుంచి ఈ కమిటీకి జనరల్ రావత్‌ ఛైర్మన్‌గా కొనసాగారు. డిసెంబరు 8న తమిళనాడులో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలిన దుర్ఘటనలో జనరల్ రావత్‌ దంపతులు సహా 14 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీవోఎస్‌సీ కమిటీ బుధవారం సమావేశమై రావత్‌ దంపతులకు నివాళులర్పించింది. ఆ తర్వాత జనరల్ నరవణె కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 

ఇదిలా ఉండగా.. రావత్‌ మరణం తర్వాత కొత్త సీడీఎస్‌ ఎవరనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సీడీఎస్‌గా జనరల్ నరవణె పేరే ప్రధానంగా వినిపిస్తోంది. సీనియార్టీ పరంగా ఆయననే ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జనరల్ నరవణె.. 2019 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.. వాయుసేన అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్ చౌధరి ఈ ఏడాది సెప్టెంబరు 30న, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ నవంబరు 30న బాధ్యతలు చేపట్టారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని