
నేనూ ఆ టీకానే తీసుకోబోతున్నా:బోరిస్
లండన్: ఆస్ట్రాజెనికా టీకా సురక్షితమేనని, త్వరలో తాను కూడా అదే టీకా తీసుకోబోతున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ టీకా వినియోగాన్ని పలు ఐరోపా దేశాలు నిలిపివేయడంపై బ్రిటన్ పార్లమెంట్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కారణంగా రక్తంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ఐరోపాలోని పలు దేశాలు ఆ టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోరిస్ జాన్సన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘అతి త్వరలో నాకు కరోనా టీకా ఇవ్వనున్నట్లు సమాచారం అందింది. అది కచ్చితంగా ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా రూపొందించిన టీకానే అయ్యే అవకాశం ఉంది’ అని జాన్సన్ తెలిపారు. ఇప్పటికే ఈ టీకా గురించి బోరిస్ ఓ మీడియాతో మాట్లాడుతూ..‘ఆస్ట్రాజెనికా టీకా సురక్షితమే. ఇది కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తోంది’ అని పేర్కొనడం విశేషం. బ్రిటన్లో ఇప్పటి వరకు 25 మిలియన్ల మందికి పైగా తొలి డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. వారిలో 11 మిలియన్ల మంది ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకొన్నారు.
తమ వ్యాక్సిన్ కారణంగా రక్తంలో సమస్యలు తలెత్తున్నాయని వచ్చిన ఆరోపణల్ని ఆస్ట్రాజెనికా సంస్థ ఖండించింది. టీకా వల్ల రక్తం గడ్డ కడుతోందనడానికి రుజువులు లేవని నిపుణులు తేల్చి చెప్పినట్లు ప్రకటించింది. తమ వ్యాక్సిన్ సురక్షితమేనని వివరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.