Aaditya Thackeray: పిల్లలతో ఆందోళన.. చిక్కుల్లో ఆదిత్య ఠాక్రే..!

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే వివాదంలో చిక్కుకున్నారు. మెట్రో కార్‌ షెడ్‌ను తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించేందుకు

Published : 12 Jul 2022 02:02 IST

ముంబయి: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే వివాదంలో చిక్కుకున్నారు. మెట్రో కార్‌ షెడ్‌ను తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించేందుకు రాష్ట్ర నూతన ప్రభుత్వం చేపడుతోన్న చర్యలపై ఠాక్రే ఆందోళన చేపట్టారు. అయితే ఈ నిరసనల్లోకి చిన్నారులను తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌.. ఆదిత్యపై కేసు నమోదు చేయాలంటూ ముంబయి పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.

మెట్రో కార్‌షెడ్‌పై ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే ఆదివారం ఆరే కాలనీలో ‘సేవ్‌ ఆరే’ పేరుతో నిరసన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అయితే ఈ ఆందోళనల్లో ఆదిత్య ఠాక్రే చిన్నారులను కూడా ఉపయోగించుకున్నారంటూ కొందరు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌)కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్‌సీపీసీఆర్‌ రిజిస్ట్రార్‌ అను చౌధరి ముంబయి పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. ‘‘ఆదిత్య ఠాక్రే ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోల్లోనూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొనడం స్పష్టంగా కన్పిస్తోంది. జువైనల్‌ జస్టిస్‌ చట్టం సెక్షన్‌ 75 ప్రకారం ఇది నేరం.  అందువల్ల ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు చేపట్టి ఆయనపై వెంటనే కేసు నమోదు చేయండి’’ అని అను చౌధరి నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ ఫొటోల్లో కన్పిస్తోన్న చిన్నారుల వాంగ్మూలాన్ని కూడా రికార్డ్‌ చేసి శిశు సంక్షేమ కమిటీకి సమర్పించాలని ఆదేశించింది. దీనిపై మూడు రోజుల్లోగా చర్యలు చేపట్టాలని సూచించింది.

అసలేంటీ ప్రాజెక్టు వివాదం..

2019లో దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వ హయాంలో ఆరే కాలనీలో మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్.. బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ) అనుమతి కూడా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆరే కాలనీలో వందలాది చెట్లను నరకాల్సి రావడంతో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పర్యావరణ కార్యకర్తలతో పాటు ఆదిత్య ఠాక్రే కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత భాజపాతో తెగదెంపులు చేసుకున్న శివసేన.. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి మహా వికాస్‌ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలోనే 2019 నవంబరులో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెట్రో కార్‌ షెడ్‌పై ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్‌షెడ్‌ను ఆరే కాలనీ నుంచి కంజూర్‌మార్గ్‌కు తరలించారు. అంతేగాక, ఆరే కాలనీని రిజర్వ్‌ అటవీ ప్రాంతంగా ప్రకటించారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ హైకోర్టును ఆశ్రయించింది. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని, రాష్ట్రంతో సంబంధం లేదని పేర్కొంది. దీంతో ఠాక్రే నిర్ణయంపై బాంబే హైకోర్టే స్టే విధించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. అయితే ఇటీవల భాజపా మద్దతుతో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టుపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టింది. మెట్రో కార్‌షెడ్‌ను తిరిగి ఆరే కాలనీలో చేపట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని