ఇదేం నిర్లక్ష్యం.. సర్జరీ చేసి.. పొట్టలో దూదిని వదిలేసి..

కాన్పుకోసం వెళ్లిన ఓ మహిళకు సర్జరీ చేసిన వైద్యులు పొట్టలో దూది ఉంచేసి కుట్లు వేసేశారు. తీవ్ర కడుపునొప్పి రావడంతో తాజాగా మరోసారి శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు.

Published : 26 Aug 2023 19:07 IST

పట్నా: అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాన్పుకోసం ఓ మహిళ ఆస్పత్రిలో చేరితే.. సర్జరీ చేసి.. దూదిని పొట్టలోనే ఉంచి కుట్లు వేసేశారు. తీవ్ర కడుపునొప్పితో బాధితురాలు మళ్లీ ఆస్పత్రికి వెళ్తే.. కుట్లు వేసిన చోట డ్రెస్సింగ్‌ చేసి పంపించేశారు. ఈ ఘటన బిహార్‌లోని భగల్‌పుర్‌ జిల్లాలోని జవహర్‌లాల్‌ నెహ్రూ వైద్య కళాశాలలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రియాంక కుమారి అనే మహిళ ఫిబ్రవరి 19న పురుటి నొప్పులతో మయాగంజ్‌లోని వైద్యకళాశాల ఆస్పత్రిలో చేరింది. సాధారణ ప్రసవం రాకపోవడంతో వైద్యులు సర్జరీ చేసి మగ శిశువును బయటకి తీశారు. అనంతరం ఫిబ్రవరి 26న ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

కొన్ని రోజుల తర్వాత ఆమెకు కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో కుటుంబ సభ్యులు మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కుట్లు వేసిన చోట డ్రస్సింగ్ చేసి, ఇదేం పెద్ద సమస్య కాదంటూ ఇంటికి పంపేశారు. కానీ, అసలు సమస్యను మాత్రం గుర్తించలేకపోయారు. క్రమంగా నొప్పి తీవ్రమవ్వడంతో ఆమెను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయగా.. పొట్టలో దూడి ఉండ ఉన్నట్లు గుర్తించారు. వీలైనంత తొందరగా దానిని బయటకు తీయకపోతే ప్రేగులకు కూడా ప్రమాదం తలెత్తుతుందని వైద్యులు చెప్పడంతో తాజాగా మళ్లీ సర్జరీ చేసి దానిని తొలగించారు. అదృష్టం కొద్దీ ప్రాణహాని తప్పినా..కీలక విధులు నిర్వర్తించాల్సిన వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా ఉండకూడదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఘటనకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని