Cyrus Mistry: కారు అతివేగమే మిస్త్రీ కారు ప్రమాదానికి కారణం: ఎస్పీ

ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్‌ గ్రూప్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ కారు ప్రమాదానికి అతివేగమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై పాల్ఘార్‌ ఎస్పీ బాలాసాహెబ్‌ పాటిల్‌ దర్యాప్తు చేపట్టారు.

Updated : 29 Sep 2022 18:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్‌ గ్రూప్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ కారు ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ ఘటనపై పాల్ఘార్‌ ఎస్పీ బాలాసాహెబ్‌ పాటిల్‌ విచారణ చేపట్టారు.  దర్యాప్తులో లభించిన ప్రాథమిక ఆధారాలను చూసి అతివేగమే ప్రమాదానికి కారణమనే నిర్ణయానికి వచ్చినట్లు బాలాసాహెబ్‌ పేర్కొన్నారు. నిర్ణీత వేగాన్ని మించి ప్రయాణించడంతో కారు ప్రమాదానికి గురైందన్నారు. ప్రమాదం జరిగే సమయానికి కారు గంటకు 89 కిలో మీటర్ల వేగంలో ప్రయాణిస్తోందని వివరించారు. కానీ, అక్కడ వేగపరిమితి కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే. వాహనాల రద్దీ, సూర్యా నది వద్ద రోడ్డు మారడం వంటి కారణాలతో ఇక్కడ వేగపరిమితిని కుదించారు.  

ఇటీవల ఎస్పీ పాటిల్‌ కీలక విభాగాలతో భేటీ నిర్వహించారు. దీనిలో జాతీయ రహదారుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, పబ్లిక్‌ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ జాతీయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారిని తరలించేందుకు నాలుగు అంబులెన్స్‌లను ఎల్లవేళలా సిద్ధంగా ఉంచాలని కోరారు. ప్రమాదకర ప్రదేశాల్లో నోటీస్‌ బోర్డులు , అనధికారిక రోడ్‌ క్రాసింగ్‌ల తొలగింపు, వాహనదారులను అప్రమత్తం చేసే లైట్లు, వేగాన్ని అదుపు చేసే స్ట్రిప్‌లు అమర్చాలని జాతీయ రహదారుల శాఖను కోరారు. 

ఎస్పీ ప్రకటనపై ‘ఆల్‌ ఇండియా వాహన్‌ చాలక్‌ మలాక్‌ మహాసంఘ్‌’ అధ్యక్షుడు హర్‌బాన్‌ సింగ్‌ స్పందించారు. ఎస్పీ చెబుతున్నట్లు అక్కడ వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లు కాదని పేర్కొన్నారు. అక్కడ ఎటువంటి సైన్‌ బోర్డులు లేవని వివరించారు. సాధారణ హైవేపై వలే అక్కడ కూడా గంటకు 80 కిలోమీటర్ల వేగపరిమితి వర్తిస్తుందన్నారు. మిస్త్రీ వాహనం స్వల్పంగా ఈ పరిమితిని మించిందన్నారు. ఆ ప్రదేశంలో నెమ్మదిగా వెళ్లాలనే బోర్డులు ఏర్పాటు చేస్తే కొంత మేరకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ నెల 4వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త సైరస్‌ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు మహారాష్ట్రలోని పాల్ఘార్‌ వద్ద సూర్యా నదిపై వంతెన సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మిస్త్రీతోపాలు జహంగీర్‌ పండోలే కూడా చనిపోయారు. ప్రమాద సమయంలో కారును ప్రముఖ వైద్యురాలు అనహిత పండోలే డ్రైవింగ్‌ చేస్తున్నారు. ఆమె పక్కనే భర్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త డారియస్‌ పండోలే కూర్చొన్నారు. ఈ ఘటనలో వీరిద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని