నీటి ప్రాజెక్టులు పర్యావరణానికి హాని కాదు!

విద్యుత్‌ ఉత్పత్తితో పాటు బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణం పర్యావరణానికి హానికరమనే వాదనను కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తోసిపుచ్చారు.

Published : 24 Feb 2021 18:51 IST

అధ్యయనం అవసరమన్న కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి

దిల్లీ: విద్యుత్‌ ఉత్పత్తితో పాటు బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణం పర్యావరణానికి హానికరమనే వాదనను కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తోసిపుచ్చారు. ఇవి వాస్తవానికి పర్యావరణానికి హాని కలిగిస్తాయో? లేదోననే విషయాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ‘నదీ పరివాహక ప్రాంతాలు, ఆనకట్టలు-సుస్థిరాభివృద్ధి’పై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్‌మంత్రి ఆర్‌కే సింగ్‌ ఈ విధంగా మాట్లాడారు.

‘పర్యావరణానికి హాని కలిగే విషయంగా దీన్ని చూడటం లేదు. ఆనకట్టల నిర్మాణాలను కేవలం ప్రగతిగానే చూస్తున్నా. భాక్రానంగల్‌ ప్రాజెక్టు వల్లే పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలు నేడు మెరుగైన స్థితిలో ఉన్నాయి. బిహార్‌లో ఏ వ్యక్తిని పలుకరించినా కోసి నదిపై అతిపెద్ద ప్రాజెక్టును కట్టాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు’’ అని కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్‌ అభిప్రాయపడ్డారు. భారీ ప్రాజెక్టులు నిర్మించిన చోట అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని.. ఇదే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఎలాంటి అధికారిక అధ్యయనం లేకుండానే నీటిపారుదల ప్రాజెక్టులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయంటూ స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం పేర్కొనడంపై కేంద్రమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వాటివల్ల నీటి వనరులను సరైన విధంగా వినియోగించుకోవడంలో దశాబ్దం, రెండు దశాబ్దాలు వెనకబడ్డామన్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతోందని, దీనిపైన చర్చ జరగాల్సిన అవరసరం ఉందని కేంద్ర విద్యుత్‌మంత్రి ఆర్‌కే సింగ్ స్పష్టంచేశారు.

నీటి వనరులను వినియోగించుకోవడం క్రీస్తు పూర్వం నుంచే మొదలైందన్న కేంద్ర మంత్రి, నైలు నదిపైనా ఆనకట్టలు కట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, నీటి ప్రవాహానికి ఏవిధంగా ఆనకట్టలు కట్టారనే దానిమీదే పర్యావరణానికి హాని అనే విషయం ఆధారపడి ఉంటుందని స్పష్టంచేశారు. ఇదిలాఉంటే, దేశంలో వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం 14వేల మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని