
Delhi Highcourt: ‘ఆమె’ ఫొటోలు, వీడియో లింక్‌లు తొలగించండి: దిల్లీ హైకోర్టు
దిల్లీ: ఓ వివాహిత మహిళకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు కలిగిన వెబ్‌సైట్‌లు, లింక్‌లను ఇంటర్నెట్ నుంచి తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని దిల్లీ హైకోర్టు సూచించింది. ఈ మేరకు ప్రముఖ దిగ్గజ సెర్చింజన్ గూగుల్, యూట్యూబ్ సహా దిల్లీ పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఇంటర్నెట్‌లో అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఇటీవల ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ విచారణ జరిపారు. ఇది ప్రతికూల వ్యాజ్యం కాదని, ఈ నెల 16న విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈలోగా పిటిషనర్‌కు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు ఉన్న లింక్‌ను ఇంటర్నెట్ నుంచి తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై గూగుల్, యూట్యూబ్, కేంద్రం, దిల్లీ సైబర్ పోలీసుల సమాధానాన్ని కోరారు.
మరోవైపు, నకిలీ పేర్లతో నిర్వహిస్తున్న అశ్లీల వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్ కోరడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పలు వెబ్‌సైట్లలో కనిపించే మహిళల నగ్న చిత్రాలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలను కూడా నిరోధించేలా గూగుల్‌ను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది అనురాగ్ అహ్లూబాలియా స్పందిస్తూ.. ఇంటర్నెట్‌లో అభ్యంతకర ఫొటోలు, వీడియోలు తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అఫిడవిట్ సమర్పించేందుకు సమయం కోరారు. యూట్యూబ్‌లో బ్లాక్ చేసిన పలు లింక్‌ల జాబితాను గూగుల్, యూట్యూబ్ తరఫు న్యాయవాది మమతా ఝా కోర్టుకు సమర్పించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.