ED: ఛత్తీస్‌గఢ్‌ సీఎం డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా అరెస్టు

ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌(Bhupesh Baghel) డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా(Saumya Chaurasia)ను ఈడీ(ED) అరెస్టు చేసింది.

Published : 02 Dec 2022 19:25 IST

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌(Bhupesh Baghel) డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా(Saumya Chaurasia)ను ఈడీ(ED) అరెస్టు చేసింది. రాష్ట్రంలో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఆమెను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో శక్తిమంతమైన బ్యూరోక్రాట్‌గా పేరున్న చౌరాసియాను ఈడీ అధికారులు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అరెస్టు చేసిన అనంతరం సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది భద్రతతో ఈడీ అధికారులు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. 

గతేడాది జూన్‌లో రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఐటీ దాడుల్లో దాదాపు రూ.100 కోట్లకు పైగా హవాలా రాకెట్‌ బయటపడింది. హవాలా లావాదేవీల కింద అధికారిక బ్యాంకింగ్‌ ఖాతాలోకి ప్రవేశించకుండా నగదు చేతులు మారినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు విచారణను ఈడీ చేపట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు రవాణాకు అక్రమ లెవీ వసూలు చేస్తూ భారీ కుంభకోణానికి పాల్పడిన వ్యవహారంలో ఇప్పటికే పలుమార్లు సోదాలు జరిపిన ఈడీ అధికారులు అక్టోబర్‌లో ఐఏఎస్ అధికారి సమీర్‌ వైష్ణోయ్‌, మరో ఇద్దరిని అరెస్టు  చేశారు. 2020 ఫిబ్రవరిలో ఆమె ఇంట్లోనూ సోదాలు చేశారు. తాజాగా చౌరాసియాను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఈడీ అన్ని పరిధిలూ దాటి ప్రవర్తిస్తోందని.. ప్రజలపై అమానవీయంగా వ్యవహరిస్తోందంటూ ఇటీవల సీఎం భూపేశ్‌ బఘేల్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని