Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. నేడు మళ్లీ రావాలని చెప్పిన అధికారులు!

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు రెండోసారి హాజరైన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఈడీ అధికారులు దాదాపు 10 గంటలపాటు విచారించారు. మంగళవారం కూడా హాజరు కావాలని అధికారులు సూచించారు.

Updated : 21 Mar 2023 04:16 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కార్యాలయంలో  సోమవారం విచారణకు హాజరైన కవితను దాదాపు 10గంటలకు పైగా అధికారులు విచారించారు. అనంతరం ఈడీ ఆఫీస్‌ నుంచి బయటకు వచ్చిన కవిత విజయ చిహ్నం చూపుతూ తన కారులో బయల్దేరారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు ఆమెను పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద అధికారులు ప్రశ్నించారు. మద్యం కేసులో మనీలాండరింగ్‌ అంశంలో కవితపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు కవిత విచారణ కొనసాగుతుండగానే.. తెలంగాణ అదనపు ఏజీ దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 10 గంటల పాటు విచారణ అనంతరం రాత్రి 9 గంటల తర్వాత కవిత విచారణను ముగించారు. 

రేపు మరోసారి ఈడీ ముందుకు కవిత!

సోమవారం సుదీర్ఘంగా కవితను విచారించిన ఈడీ అధికారులు మంగళవారం మరోసారి విచారణకు రావాలని సూచించారు. మంగళవారం ఉదయం 11గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కవితకు చెప్పినట్టు సమాచారం.

దిల్లీ మద్యం కేసులో  కవితకు  ఈడీ తొలుత మార్చి 8న నోటీసులు జారీ చేసింది. 9న దిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించింది. దీంతో 11న వస్తానన్న కవిత.. తాను చెప్పిన తేదీ ప్రకారమే దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లగా.. అప్పుడు అధికారులు దాదాపు 8గంటలకు పైగా సుదీర్ఘంగా  విచారించిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని 11వ తేదీనే మళ్లీ ఈడీ సమన్లు ఇవ్వగా..  మార్చి 15న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఈ నెల 24న విచారణకు రావాల్సి ఉన్న నేపథ్యంలో అప్పటివరకు వేచి చూడాలని ఈడీని కోరుతూ  లేఖ రాశారు. గత విచారణలో అధికారులు కోరిన సమాచారాన్ని తన తరఫు న్యాయవాది భరత్‌తో పంపారు. అయితే, అదే రోజు ఈడీ అధికారులు ఈ నెల 20న తమ ఎదుట విచారణకు రావాలని నోటీసులు పంపగా.. కవిత సోమవారం విచారణకు హాజరయ్యారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని