Lalu Prasad Yadav: కుదుటపడని లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు తరలింపు..!

రాష్ట్రీయ జనతాదళ్ (RJD)అధినేత, బిహార్‌(Bihar)మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)ను మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు.

Published : 06 Jul 2022 19:39 IST

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(RJD) అధినేత, బిహార్‌(Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)ను మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. ఇటీవల ఇంట్లో మెట్లపై నుంచి జారిపడటంతో లాలూ గాయపడ్డారు. వీపు భాగానికి గాయమై భుజం విరగడంతో ఆయనకు పట్నాలోని పారస్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ.. ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రంలోగా ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ఆయన్ను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో ఆయన వెంట భార్య రబ్రీదేవీ, ఇద్దరు కుమారులు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్, తేజస్వి యాదవ్‌, కుమార్తె మిసా భారతి వెళ్లనున్నారని పేర్కొన్నాయి. గతంలో కూడా ఆయన ఎయిమ్స్‌లో వైద్య సహాయం పొందారు. 

జారిపడిన గాయాలతో పాటు ఆయన్ను ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఆయన బాధపడుతున్నారు. మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ లాలూ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బిహార్‌ సీఎం నితీశ్ కుమార్ పట్నాలో ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆసుపత్రి ఖర్చులు భరిస్తుందని, అది ఆయన హక్కు అని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని