Updated : 15/01/2022 16:12 IST

India-China: సైనిక దినోత్సవం రోజున చైనాకు ఘాటు హెచ్చరికలు

కుయుక్తుల్ని తిప్పికొడతాం : నరవణె

దిల్లీ: దేశ సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుయుక్తుల్ని ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె పునరుద్ఘాటించారు. భారత్‌ ఎల్లవేళలా శాంతినే కాంక్షిస్తుందని.. అది బలం నుంచి పుట్టిన ఆకాంక్షేనని స్పష్టం చేశారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా ఆయన పరోక్షంగా చైనాను ఘాటుగా హెచ్చరించారు. ఏటా జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకొంటారు. 1949లో బ్రిటిష్‌ వారి నుంచి భారత సైన్యం కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా ఫీల్డ్‌ మార్షల్‌ కె.ఎం.కరియప్పా బాధ్యతలు స్వీకరించినందుకు గుర్తుగా ఈరోజును జరపుకొంటున్నారు.

సమానత్వం, పరస్పర భద్రత సూత్రాల ఆధారంగా ఏర్పాటు చేసుకున్న నిబంధనల ద్వారానే వివాదాల పరిష్కారం జరుగుతుందని నరవణె స్పష్టం చేశారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో గత కొన్ని ఏళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. డ్రాగన్‌ ఆర్మీ ఏకపక్షంగా సరిహద్దుల్ని మార్చే ప్రయత్నం చేయడంతో భారత్‌ వాటిని దీటుగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో మే 5, 2020న గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నాటి నుంచి పలు దఫాల్లో చర్చలు జరిపినప్పటికీ.. చైనా తన వక్రబుద్ధిని మాత్రం వదులుకోవడం లేదు. సరిహద్దుల్లో ఏదో రకమైన అలజడి సృష్టిస్తూ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేస్తూ వస్తోంది. భారత్‌ సైన్యం వాటిని దీటుగా తిప్పికొడుతోంది. 

ఇతర దేశాల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుందని నరవణె సైనిక దినోత్సం సందర్భంగా ఇచ్చిన సందేశంలో పరోక్షంగా చైనాను ఉద్దేశించి హెచ్చరించారు. ఎలాంటి సైనికపరమైన విధ్వంసాన్నైనా ఎదుర్కోవడానికి భారత సైనికులు అదనపు ఏర్పాట్లు సైతం సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ పటిష్ఠ ప్రణాళికలు వ్యవస్థీకృతం చేశామని స్పష్టం చేశారు. ముష్కర మూకల ఏరివేతకు ఇప్పటికే తాము తీసుకున్న చర్యలు భారత సైన్యం సన్నద్ధత.. తిప్పికొట్టే సామర్థ్యాన్ని నిరూపించాయని తెలిపారు.

సైన్యం సేవల్ని కొనియాడిన రాష్ట్రపతి, ప్రధాని..

సైనిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సైన్యం సేవలను కొనియాడారు. దేశ, జాతీయ భద్రతను కాపాడడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపాడే క్రమంలో సైనికులు వీరోచిత ధైర్య సాహసాలు కనబరుస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.

సైనిక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. ధైర్య, పరాక్రమాలకు పెట్టింది పేరైన ఇండియన్ ఆర్మీ సేవల్ని మాటల్లో వర్ణించలేమని వ్యాఖ్యానించారు. ‘‘శత్రువుల ముప్పు నుంచి కాపాడడంతో పాటు ప్రకృతి విపత్తుల వంటి మానవతా సంక్షోభంలోనూ సైనికులు అందిస్తున్న సేవలు నిరుపమానవైనవి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న శాంతిస్థాపన కార్యకలాపాల్లోనూ మనదేశ సైనికులు వీరోచిత ప్రదర్శన కనబరుస్తున్నారు. సైనిక దినోత్సవం సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని