ట్రంప్‌ తలపై 80 మిలియన్‌ డాలర్ల రివార్డు

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ సైనిక ఉన్నతాధికారిని చంపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ గట్టి హెచ్చరికలే చేస్తోంది. అటు ట్రంప్‌ కూడా అందుకు దీటుగానే స్పందిస్తున్నారు

Published : 06 Jan 2020 15:58 IST

ఇరాన్‌ అధికారిక ఛానళ్లలో ప్రకటనలు!

టెహ్రాన్‌: అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ సైనిక ఉన్నతాధికారిని చంపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ గట్టి హెచ్చరికలే చేస్తోంది. అటు ట్రంప్‌ కూడా అందుకు దీటుగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తలపై రివార్డు ప్రకటిస్తూ ఇరాన్‌ అధికారిక మీడియాలో వస్తున్న ప్రకటనలు ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. 

ఇరాన్‌ టాప్‌ మిలిటరీ కమాండర్‌ ఖాసీం సులేమానీ అంత్యక్రియలను ప్రసారం చేస్తున్న సమయంలో ఇరాన్‌ అధికారిక టీవీ ఛానళ్లు ఓ ప్రకటన చేశాయి. అందులో ప్రతి పౌరుడు నుంచి ఒక్కో డాలర్‌ చొప్పున ట్రంప్‌ తలపై 80 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘ఇరాన్‌లో 80 మిలియన్ల మంది పౌరులున్నారు. దేశ జనాభా ఆధారంగా ఒక్కొక్కరి నుంచి ఒక్కో డాలర్‌ చొప్పున 80 మిలియన్‌ డాలర్లు సేకరిస్తాం. ఆ మొత్తాన్ని ట్రంప్‌ను చంపిన వారికి రివార్డుగా ఇస్తాం’ అని ఇరాన్‌ టీవీ ఛానళ్లు ప్రకటించినట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. 

గత శుక్రవారం బాగ్దాద్‌లో అమెరికా చేపట్టిన ఓ డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ అగ్రశ్రేణి సైనిక కమాండర్‌ ఖాసీం సులేమానీ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. లక్షలాది మంది ఇరాన్‌ పౌరులు నల్లటి దుస్తులు ధరించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. సులేమానీ హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. అయితే ఇందుకు ట్రంప్‌ కూడా గట్టిగానే బదులిచ్చారు. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే కనీవినీ ఎరుగని రీతిలో దాడులు తప్పవని హెచ్చరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని