మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ ఖరారైంది. మార్చి 3 ఉదయం 6 గంటలకు వారిని ఉరితీయాలంటూ

Updated : 17 Feb 2020 16:44 IST

కొత్త డెత్‌ వారెంట్‌ జారీ చేసిన దిల్లీ కోర్టు

దిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ ఖరారైంది. మార్చి 3 ఉదయం 6 గంటలకు వారిని ఉరితీయాలంటూ దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు సోమవారం కొత్త డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. 

ఈ కేసులో ఉరి వాయిదా పడేలా దోషులు అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి జనవరి 22నే వీరిని ఉరితీయాల్సి ఉండగా.. దోషుల్లో ఒకడైన ముకేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రూపంలో శిక్ష అమలుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు దిల్లీ కోర్టు రెండోసారి డెత్‌వారెంట్‌ జారీ చేసింది. 
అయితే దీనికి రెండు రోజుల ముందు జనవరి 30న దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దోషులు నలుగురు అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు ఉరిశిక్షపై స్టే విధించాలని పిటిషన్‌ వేశారు. దీంతో ఉరిశిక్ష అమలుపై పటియాలా హౌస్‌ కోర్టు జనవరి 31న స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉరి అమలును వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలా రెండోసారి వాయిదా పడింది. 

ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రం పిటిషన్‌ను కొట్టేసింది. ఈ కేసులో నలుగురు దోషులను వేర్వేరుగా ఉరితీయడం కుదరదని తేల్చి చెప్పింది. శిక్ష అమలుపై స్టే యథాతథంగా కొనసాగుతుందని, అయితే వారం రోజుల్లోగా దోషులు తమకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ విచారణ న్యాయస్థానం ఉరితీతకు కొత్త తేదీని నిర్ణయించవచ్చని స్పష్టం చేసింది. 

ఈసారి ఉరితీస్తారా..!

అటు హైకోర్టు దోషులకు ఇచ్చిన గడువు ముగియడం, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం మరోసారి ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు. దోషులను ఉరితీసేందుకు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేయాలని కోరారు. అయితే ఇప్పుడు కూడా దోషులు అనేక యత్నాలు చేస్తున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తిహాడ్‌ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. ఇక మరో దోషి పవన్‌ గుప్తా క్యురేటివ్‌ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. ఇంకో దోషి అక్షయ్‌ మరోసారి క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తున్నట్లు వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

అయితే దోషులు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు హైకోర్టు ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసిందని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ మోహన్‌ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఏ ఒక్క దోషి పిటిషన్‌ కూడా ఏ న్యాయస్థానంలోనూ పెండింగ్‌లో లేదని వివరించారు.  ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం దోషుల ఉరితీతకు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. మార్చి 3న దోషులను ఉరితీయాలంటూ తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించింది. 

ఇదీ చదవండి:

నిర్భయ దోషి నిరాహార దీక్ష
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని