చాలు..చాలు.. మరి మీరేం చేశారు?

ప్రధాని మోదీ ‘షీ ఇన్‌స్పైర్స్‌ అజ్‌’ ఉద్యమంలో పాల్గొనడానికి తిరస్కరించిన పర్యావరణ కార్యకర్త లిసీప్రియా కంగజం కాంగ్రెస్‌ నాయకులకూ చురకలంటించింది. తనని రాజకీయాలకు వాడుకోవద్దని హితవు పలికిన.......

Updated : 09 Mar 2020 12:04 IST

కాంగ్రెస్‌కు చురకలంటించిన పర్యావరణ కార్యకర్త లిసీప్రియా

దిల్లీ: ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘షీ ఇన్‌స్పైర్స్‌ అజ్‌’ ఉద్యమంలో పాల్గొనడానికి తిరస్కరించిన పర్యావరణ కార్యకర్త లిసీప్రియా కంగజం కాంగ్రెస్‌ నాయకులకూ చురకలంటించింది. తనని రాజకీయాలకు వాడుకోవద్దని హితవు పలికిన ఈ ఎనిమిదేళ్ల చిన్నారి పర్యావరణ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ మాత్రం ఏం చేస్తోందని ప్రశ్నించింది. తనని గౌరవించడానికి బదులు తన గొంతుకను వినాలని మోదీని కోరిన లిసీప్రియా.. కాంగ్రెస్‌కూ తన డిమాండ్లు ఏమిటో వివరించింది. 

కేంద్ర ప్రభుత్వ అవకాశాన్ని తిరస్కరించినందుకు లిసీప్రియాను అభినందిస్తూ కాంగ్రెస్ ట్వీట్‌ చేసింది. మహిళాసాధికారితపై మాటలకే పరిమితమైన మోదీకి పర్యావరణ కార్యకర్త లీసిప్రియా బాధ్యతల్ని గుర్తుచేసింది అని వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన లీసీ..‘‘ఓకే కాంగ్రెస్‌. మీరు నాపై సానుభూతి చూపిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అసలు విషయానికి వద్దాం. పార్లమెంటు సమావేశాల్లో మీ ఎంపీలు ఎంతమంది నా డిమాండ్లను లేవనెత్తనున్నారు. కేవలం ట్విటర్ ప్రచారానికి నా పేరును వాడుకోవద్దు. నా గొంతుకను ఎవరు వింటున్నారు?’’ అని చురకలంటించింది. 

కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ సైతం లిసీప్రియాకు మద్దతు పలికారు. ‘జాతీయ స్వచ్ఛవాయు విధానాని’కి కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే దీనిపై తమ పార్టీ విస్తృత స్థాయిలో సంప్రదింపులు కూడా జరిపిందన్నారు. థరూర్‌కూ లీసీ దీటుగా సమాధానం ఇచ్చారు. ‘‘సర్‌, మీ స్పందనకు అభినందిస్తున్నాను. స్వచ్ఛవాయు విధానం పేరిట మీరు నా డిమాండ్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. మీ కోసం నా డిమాండ్లు ఏంటో మరోసారి వివరిస్తున్నాను’’ అంటూ తన డిమాండ్ల జాబితాను ట్విటర్‌లో జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు