బిహార్‌ రాజకీయాల్లోకి ప్రియా చౌధరి  

జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) సీనియర్‌ నాయకుడు వినోద్‌ చౌధరి కుమార్తె, లండన్‌కు చెందిన పుష్పమ్‌ ప్రియా చౌధరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే తండ్రి ఉన్న జేడీయూలో చేరకుండా సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు.

Published : 09 Mar 2020 13:32 IST

దిల్లీ: జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) సీనియర్‌ నాయకుడు వినోద్‌ చౌధరి కుమార్తె, లండన్‌కు చెందిన పుష్పమ్‌ ప్రియా చౌధరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే తండ్రి ఉన్న జేడీయూలో చేరకుండా సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. అంతేగాక, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రియా చౌధరి ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆదివారం బిహార్‌లోని దాదాపు అన్ని వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. 

‘ప్లూరల్స్‌’ పేరుతో ప్రియ పార్టీని ప్రారంభించారు. బిహార్‌ అభివృద్ధి కోసం ప్రజలంతా తనతో కలిసి పనిచేయాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. తాను ముఖ్యమంత్రినైతే 2025 నాటికి బిహార్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కాగా.. ప్రియ రాజకీయ ప్రవేశంపై ఆమె తండ్రి వినోద్‌ చౌధరి స్పందించారు. ‘ఆమె మేజర్‌.. చదువుకున్న అమ్మాయి. రాజకీయాల్లోకి రావడమనేది పూర్తిగా ఆమె నిర్ణయమే. అయితే, సీఎం నితీశ్‌ కుమార్‌కు పోటీగా బరిలోకి దిగుతానంటే మాత్రం పార్టీగానీ, నేను గానీ ఎప్పటికీ మద్దతివ్వను’ అని వినోద్‌ తెలిపారు. 

దర్భంగాకు చెందిన ప్రియా చౌధరి ప్రస్తుతం లండన్‌లో స్థిరపడ్డారు. యూనివర్శిటీ ఆఫ్‌ ససెక్స్‌ నుంచి డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ నుంచి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు