22న జనతా కర్ఫ్యూ: ప్రధాని

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.....

Published : 20 Mar 2020 00:43 IST

ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పాటిద్దాం
కరోనాపై జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

దిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జనం కోసం జనం ద్వారా జనమే విధించుకునే కర్ఫ్యూ అని ప్రధాని అన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో జాతినుద్దేశించి నరేంద్రమోదీ ప్రసంగించారు.

ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తు

‘‘ప్రపంచ మానవాళి మొత్తం కరోనా సంక్షోభం ఎదుర్కొంటోంది. రెండు నెలలుగా ఇది కొనసాగుతోంది. ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తును మనం ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగురూకతతో వ్యవహరించడం అవసరం. అందరం చేయి చేయి కలిపి మహమ్మారిపై యుద్ధం చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మహమ్మారి సృష్టిస్తున్న విలయాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారు. ఇప్పుడే ఊరట లభించేలా కనిపించడం లేదు. వచ్చే కొద్ది వారాలు మీ అందరి సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. ఇందుకు మన ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి దృఢ సంకల్పం. రెండోది కలిసి పోరాడటం’’ అని ప్రధాని అన్నారు.

అనవసరంగా బయటకొద్దు
‘‘కరోనా వంటి వైరస్‌ను ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారమయ్యేది కాదు. ప్రజలంతా బాధ్యతలు గుర్తెరిగి మసలుకోవాలి. అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావొద్దు. ప్రజలు పరస్పరం దూరం పాటించాలి. ఏకాంతంగా ఉండంతోనే ఈ మహమ్మారిని కట్టడి చేయొచ్చు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. వీలైనంత వరకు వ్యాపారాలు, ఉద్యోగాలు ఇంట్లోంచే చేయాలి. వైద్యరంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి తప్పనిసరి విభాగాల్లో పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వద్దు’’ అని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

న కోసమే ఈ కర్ఫ్యూ

‘‘కరోనా నివారణ కోసం జనతా కర్ఫ్యూ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నా. ఈ ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రావొద్దు. జనతా కర్ఫ్యూ ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఇది జనం కోసం జనం ద్వారా జనమే విధించుకునే కర్ఫ్యూ. అందరం సంయమనంతో దీన్ని పాటిద్దాం. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సైరన్‌ మోగించాలి. ఆ సమయంలో ఇంట్లోని గుమ్మాలు, కిటీకీలు, బాల్కనీల్లో నిల్చొని చప్పట్లు కొట్టి కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం తెలియజేద్దాం. ఈ మహమ్మారి తగ్గే వరకు అత్యవసర సర్జరీలు మినహా సాధారణ సర్జరీలు వాయిదా వేసుకుందాం. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై ఒత్తిడి లేకుండా చూద్దాం. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అంచనా వేయడానికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని ప్రధాని నరేంద్రమోదీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని