రెండోసారి పాజిటివ్‌: ప్రమాదమే లేదా?

విశ్వవ్యాప్తంగా 3లక్షలకు పైగా ప్రజలను బలితీసుకున్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని దేశాల్లో ఈ వైరస్‌ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరోసారి రెక్కలు చాస్తోంది.

Published : 20 May 2020 12:34 IST

సియోల్‌: విశ్వవ్యాప్తంగా 3లక్షలకు పైగా ప్రజలను బలితీసుకున్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని దేశాల్లో ఈ వైరస్‌ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరోసారి రెక్కలు చాస్తోంది. ఈ సమయంలో కొవిడ్‌-19 మహమ్మారిపై ఇప్పటికే ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, రెండోసారి కరోనా సోకిన వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం లేదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి వ్యక్తుల నుంచి వేరొకరికి వైరస్‌ సోకే ప్రమాదం కూడా తక్కువేనని శాస్త్రవేత్తలు అంచనా వేయడం ఊరటకలిగిస్తోంది.

దక్షిణ కొరియాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ప్రివెన్షన్‌(కేసీడీసీ) దాదాపు కొవిడ్‌ నుంచి కోలుకున్న 400మందిపై పరిశోధనలు జరిపింది. వీరిలో దాదాపు 285మంది తిరిగి వైరస్‌ బారినపడిన వారు ఉన్నారు. వీరితో సన్నిహితంగా ఉన్న దాదాపు 790మందిని పరీక్షించగా.. వీరిలో ఒక్కరికి కూడా వైరస్‌ నిర్ధారణ కాలేదని తేల్చింది. ఒకసారి కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తుల్లో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించింది. అయితే ఇవి ఎంతవరకు రక్షించగలుగుతాయనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. ఈ సందర్భంలో కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వ్యక్తులను వైరస్‌ వ్యాప్తి కారకాలుగా గుర్తించడం లేదని దక్షిణ కొరియా అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా తాజాగా మార్గదర్శకాలను కూడా సవరించారు. ఒక్కసారి కొవిడ్‌-19 బారినపడి కోలుకున్న వారు తమ ఉద్యోగం, పాఠశాలలకు వెళ్లే సమయంలో నెగిటివ్‌ ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఐసోలేషన్‌ నుంచి బయటికి వచ్చిన వారికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఒకవేళ రెండోసారి పాజిటివ్‌ వస్తే.. వారిని కేవలం పీసీఆర్‌ రీ-డిటెక్టెడ్‌ కేసులుగానే పరిగణిస్తామని కేసీడీసీ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో కొవిడ్‌-19 నిర్ధారణకు పీసీఆర్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. అయితే రెండోసారి పాజిటివ్‌ రావడానికి పరీక్ష విధాన లోపమే కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. శరీరంలో అప్పటికే చనిపోయి ఉన్న వైరస్‌ కణాలను కూడా నిర్ధారణ పరీక్షలో యాక్టివ్‌ కణాలుగా గుర్తించడం వల్లే పాజిటివ్‌ వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత లేనప్పటికీ ఆ కోణంలో కూడా విస్తృత పరిశోధనలు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 50లక్షల మంది ఈ వైరస్‌ బారినపడగా 3లక్షల మంది మృత్యువాతపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ తీవ్రత తగ్గడం, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకొని కొన్నిదేశాలు లాక్‌డౌన్‌ నుంచి బయటకు వస్తున్నాయి. ఈ సందర్భంలో తాజా నివేదికలు ఊరట కలిగిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని