నేపాల్ వాదనకు చారిత్రక ఆధారాల్లేవ్‌!

భారత్‌-నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించబోమని భారత్ ప్రకటించింది. భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్‌ను నేపాల్ మంత్రిమండలి........

Published : 21 May 2020 03:16 IST

దిల్లీ: భారత్‌-నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించబోమని భారత్ ప్రకటించింది. భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్‌ను నేపాల్ మంత్రిమండలి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రాత్మకత ఆధారాలూ లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత విదేశాంగశాఖ స్పష్టంచేసింది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలు ఉన్నాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. 

‘‘ఈ విషయంలో భారత్‌ స్థానంపై నేపాల్‌కు పూర్తి అవగాహన ఉంది. అలానే భారత దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించి, న్యాయ విరుద్ధమైన కార్టో గ్రాఫిక్‌ ప్రకటనను ఉపసంహరించుకోవాలని నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సరిహద్దు వివాదానికి సంబంధించి  ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు నేపాల్ దేశ నాయకత్వం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నాం’’ అని శ్రీవాస్తవ తెలిపారు.

టిబెట్‌లోని మానస సరోవర్‌ పుణ్యక్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్ మార్గంపై నేపాల్ విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడింది. 1816లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం రూపొందించిన మ్యాప్‌ ఆధారంగా ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ ప్రాంత్రం తమదేనని నేపాల్ వాదిస్తోంది. అయితే 1962లో చైనాతో జరిగిన యుద్ధ సమయం నుంచి లింపియాధురా, కాలాపానీ ప్రాంతంలో భారత్‌ సరిహద్దు భద్రతను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్ చర్యలు విస్మయం కలిగిస్తున్నాయి. అంతేకాకుండా తమ దేశంలో వైరస్‌ వ్యాప్తికి భారత్ కారణమని పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ నిందించారు. ఈ నేపథ్యంలో భారత్‌ తాజా వ్యాఖ్యలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని