ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం..!

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఏర్పడ్డ పరిస్థితులు ప్రపంచాన్ని ఆహార సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది........

Published : 10 Jun 2020 09:11 IST

ప్రభుత్వాలను హెచ్చరించిన ఐరాస

న్యూయార్క్‌: కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఏర్పడ్డ పరిస్థితులు ప్రపంచాన్ని ఆహార సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 820 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపింది. వీరిలో 144 మిలియన్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులేనని పేర్కొంది. ప్రస్తుతం 780 కోట్ల ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు. కానీ, వాటిని క్షేత్ర స్థాయికి చేర్చడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార కొరత లేదా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య మరింత విస్తరించనుందని తెలిపారు. పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులకు కచ్చితంగా పౌష్టికాహారం అందేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. వ్యవసాయ, ఆహార సంబంధిత సేవల్ని అత్యవసర సేవల కింద గుర్తించాలన్నారు. తద్వారా ఆయా రంగాల్లో పనిచేసేవారికి రక్షణ కల్పించాలన్నారు. ఆహార శుద్ధి, రవాణా సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని