చైనాకు గుణపాఠం చెప్పిన మాజీ ప్రధాని

చైనా కుటిట బుద్ధి గురించి ప్రపంచానికి తెలియనిది కాదు. విస్తరణ కాంక్షతో తన పొరుగు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలకు దిగుతుంటుంది....

Published : 27 Jun 2020 02:17 IST

దిల్లీ: చైనా కుటిల బుద్ధి గురించి ప్రపంచానికి తెలియనిది కాదు. విస్తరణ కాంక్షతో తన పొరుగు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలకు దిగుతుంటుంది. ముఖ్యంగా భారత్‌పై పైచేయి సాధించాలని చూసిన ప్రతిసారి ఎదురుదెబ్బలు తింటూనే ఉంటుంది. అలాంటి దేశానికి 1965లోనే భారత యువ ఎంపీ ఒకరు తన రాజకీయ తెలివితేటలతో చక్కటి గుణపాఠం నేర్పారు. ఆయన ఎవరో కాదు..భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ.

1962 యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఇంకా గంభీరంగానే ఉన్నాయి. కానీ శాంతికాముక దేశమైన భారత్‌తో చైనా ఎలాగైనా గొడవకు దిగాలని చూస్తోంది. ఇందుకు చైనా 1965 ఆగస్టు-సెప్టెంబరు మధ్య భారత్‌పై వింత ఆరోపణ చేసింది. కొందరు భారత సైనికులు తమ భూభాగంలోకి ప్రవేశించి గొర్రెలు, జడలబర్రెలను ఎత్తుకెళ్లారని ఆరోపించింది. ఆ సాకుతో యుద్ధానికి దిగి భారత్ రక్షణలో ఉన్న సిక్కిం భూభాగాన్ని ఆక్రమించాలని చైనా పన్నాగం. అదే సమయంలో భారత్ కశ్మీర్‌లో పాకిస్థాన్‌ చొరబాటుదారులతో పోరాడటంలో నిమగ్నమైంది.

ఇదే అదనుగా  చైనా భారత సైనికులను తప్పుబడుతూ కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసింది. అందులో భారత సైనికులు తమ దేశానికి చెందిన 800 గొర్రెలు, 59 జడలబర్రెలను దొంగిలించారని ఆరోపించింది. చైనా ఆరోపణను ఖండిస్తూ భారత ప్రభుత్వం ఉత్తరం రాసింది. కానీ చైనా మాత్రం తమ గొర్రెలను అప్పగించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ మరో సారి లేఖ రాసింది. దానిని ఖండిస్తూ భారత్ మరో ఉత్తరం రాసింది. అయితే చైనా ఆరోపణల వెనక ఉన్న కుటిల నీతిని పసిగట్టిన అప్పటి జన్‌సంఘ్‌ ఎంపీ వాజ్‌పేయి ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావించారు.

ఇందుకోసం ఆయన 800 గొర్రెలను ఏర్పాటుచేశారు. వాటి మెడలో ప్లకార్డులు తగిలించి వాటిపై ‘‘మమ్మల్ని తినండి కానీ ప్రపంచాన్ని కాపాడండి’’ అని రాసి దిల్లీలోని చైనా రాయబార కార్యాలంయంలోకి తోలారు. ఈ చర్యతో విస్తుపోయిన చైనా అప్పటి భారత ప్రభుత్వానికి మరో ఉత్తరం రాసింది. అందులో వాజ్‌పేయీ చర్యలను తాము అవమానంగా భావిస్తున్నట్లు పేర్కొంటూ ఈ నిరసన వెనక ప్రధాని లాల్‌ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం ఉందని ఆరోపించింది.

దీనికి అంతే దీటుగా భారత ప్రభుత్వం బదులు తెలిపింది. సరిహద్దుల్లో చైనా చర్యలకు నిరసనగా కొందరు దిల్లీ వాసులు 800 గొర్రెలను రాయబార కార్యాలయంలోకి తోలారని, ఈ నిరసన శాంతియుతంగానే జరిగిందని, దానితో తమకు ఎలాంటి సబంధంలేదని తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియని డ్రాగన్‌ దేశం ఆ విషయాన్ని అంతటి వదిలేసింది. కానీ అప్పట్లో వాజ్‌పేయీ చర్య  దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని