Afghanistan: ఆ దేశం ఉగ్రవాద అడ్డా కాకూడదు

ఉగ్రవాద కార్యకలాపాలకు తన భూభాగాన్ని ఎవరూ ఉపయోగించుకోకుండా అఫ్గానిస్థాన్‌ చూడాలని భారత్, ఆస్ట్రేలియాలు స్పష్టంచేశాయి.

Published : 12 Sep 2021 10:36 IST

అఫ్గాన్‌  ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చోటుండాలి 

  భారత్, ఆస్ట్రేలియాల ‘2+2 సమావేశం’లో చర్చ  

దిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు తన భూభాగాన్ని ఎవరూ ఉపయోగించుకోకుండా అఫ్గానిస్థాన్‌ చూడాలని భారత్, ఆస్ట్రేలియాలు స్పష్టంచేశాయి. ముష్కర ముఠాల శిక్షణ, కార్యకలాపాలకు ఆ దేశం మరోసారి సురక్షిత ఆవాసం కాకూడదన్నాయి. చైనా దురుసుతనం ప్రదర్శిస్తున్న భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుసంపన్న పరిస్థితులను నెలకొల్పేందుకు కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించాయి. భారత్, ఆస్ట్రేలియాల విదేశీ, రక్షణ మంత్రులు శనివారం దిల్లీలో సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో తొలిసారి జరిగిన ఈ ‘2+2 చర్చల’కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా ఇరు దేశాలు తమ మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాయి. 

ఈ భేటీలో భారత్‌ తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు, ఆస్ట్రేలియా పక్షాన విదేశాంగ మంత్రి మారిస్‌ పెయిన్, రక్షణ మంత్రి పీటర్‌ డట్టన్‌లు పాల్గొన్నారు. ముఖాముఖీ జరిగిన ఈ చర్చలు ఫలప్రదంగా జరిగాయని జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. అమెరికాలో ‘సెప్టెంబరు 11 దాడుల’కు 20 ఏళ్లు నిండిన రోజు జరిగిన ఈ భేటీలో.. ఉగ్రవాదంపై రాజీలేని పోరు సాగాలని రెండు దేశాలు పిలుపునిచ్చాయి. ఈ సమావేశానికి ముందు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి డట్టన్‌తో రాజ్‌నాథ్, పెయిన్‌తో జైశంకర్‌ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ భేటీలో భారత్‌-పసిఫిక్, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని పరిస్థితులపై చర్చించారు. అఫ్గాన్‌ అంశంపై తాము ప్రధానంగా దృష్టిసారించినట్లు జైశంకర్‌ తెలిపారు. ‘‘అఫ్గాన్‌లో తాలిబన్‌ తాత్కాలిక క్యాబినెట్‌లో కూర్పు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరంపైనా చర్చించాం. మహిళలు, మైనార్టీలతో వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తమైంది’’ అని ఆయన మిగతా మంత్రులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఉగ్రవాద కేంద్రస్థానానికి తాము సమీపంలో ఉన్నందువల్ల ఈ పోరు విషయంలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను గుర్తిస్తున్నామని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముష్కర ముఠాలకు అడ్డాగా అఫ్గాన్‌ తయారుకాకూడదన్న భారత అభిప్రాయంతో ఆస్ట్రేలియా ఏకీభవిస్తున్నట్లు పెయిన్‌ పేర్కొన్నారు.

క్వాడ్‌.. ‘ఆసియా నాటో’ కాదు: జైశంకర్‌ 

క్వాడ్‌ కూటమి దేశాలు తమ మధ్య ఉన్న సహకారాన్ని విస్తరించుకోవాలనుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ కూటమిలో భారత్, ఆస్ట్రేలియాతోపాటు అమెరికా, జపాన్‌లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. క్వాడ్‌ శిఖరాగ్రŸ సదస్సు ఈ నెలాఖరులో అమెరికాలో జరగనుంది. ఈ కూటమి.. ‘ఆసియా నాటో’గా మారిందంటూ వచ్చిన విమర్శలను భారత్, ఆస్ట్రేలియా మంత్రులు ఖండించారు. వాస్తవ పరిస్థితిని వక్రీకరించరాదని జైశంకర్‌ కోరారు. కూటమిలోని సభ్య దేశాలకు, ప్రపంచానికి ప్రయోజనం కలిగించడం కోసం ఉమ్మడిగా పనిచేస్తున్నామని తెలిపారు. ‘‘నాటో అనేది ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి పదం. క్వాడ్‌ అనేది భవిష్యత్‌కు సంబంధించింది. అది ప్రపంచీకరణకు దర్పణం పడుతోంది’’ అని పేర్కొన్నారు. మరోవైపు పెయిన్, డట్టన్‌లు శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని