Updated : 05 Dec 2021 13:57 IST

Konijeti Rosaiah: ముగ్గురు ముఖ్యమంత్రులకు ఆయనే నం.2

చీరాల దత్త పుత్రుడు

రోశయ్య రాజకీయ జీవితానికి అక్కడే పునాది 

చీరాల, న్యూస్‌టుడే: రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లా చీరాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన రాజకీయ జీవితానికి ఈ ప్రాంతం ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆయన స్వస్థలం కాకపోయినా దత్తపుత్రుడిగా ఆదరించి, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది. ఆచార్య ఎన్‌జీ రంగా శిష్యునిగా రాజకీయాల్లోకి వచ్చిన రోశయ్య... తొలిసారి 1967లో చీరాల నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్పతేడాతో ఓడారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిమండలిలో కీలకంగా వ్యవహరించారు. 1983లో తెదేపా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మండలిని రద్దుచేశారు. దీంతో రాజకీయంగా నిలబడాలంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 1989లో చీరాల నుంచి పోటీచేసిన ఆయనకు ప్రజలు ఘనవిజయం అందించి అసెంబ్లీకి పంపారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి... ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా రెండోస్థానంలో మాత్రం రోశయ్యే కొనసాగారు. 1994 ఎన్నికల్లో ఓడినా, మళ్లీ 2004లో గెలిచి, మంత్రి అయ్యారు. ‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే చీరాల ప్రజలు ఇచ్చిన అవకాశమే’ అని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. 

2009లో ఎమ్మెల్సీగా సీఎం అయినా, తన ఎమ్మెల్సీ నిధులను చీరాలకే కేటాయించారు. సీఎం, గవర్నర్‌ హోదాలో పలుమార్లు చీరాలలో పర్యటించారు. 

ఆయన పేరిట కాలనీలు

చీరాలలో పలు ప్రాంతాలకు రోశయ్య పేరే ఉంది. దండుబాట, కొత్తపేటలో మరోప్రాంతానికి రోశయ్య కాలనీలుగా నామకరణం చేశారు. వేటపాలెం మండలంలో కొణిజేటి చేనేత పురి, కొణిజేటి హరివిల్లు వెలిశాయి.

అధికారులకు స్వేచ్ఛ ఇచ్చేవారు..!

మంత్రిగా, ముఖ్యమంత్రిగా రోశయ్య అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయాల్సిందిగా ఆయన అధికారులపై ఒత్తిడి తెచ్చేవారు కాదు. గౌరవప్రదమైన, స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించేవారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవడంలోను ఆయన అధికారులకు అండగా నిలిచేవారు. ‘‘2004లో రోశయ్య ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి నేను ఆర్థిక శాఖలో కార్యదర్శిగా ఉన్నాను. 2009 వరకు కలసి పనిచేశాం. ఆయనే నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే వ్యక్తి కాబట్టి ఇంకొకర్ని దానికి వ్యతిరేకంగా వెళ్లమని ఒత్తిడి చేసేవారు కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... నేను తితిదే కార్యనిర్వహణాధికారిగా ఉన్నాను. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుని అడ్డుకుని కూడా అక్కడే కొనసాగగలిగానంటే అది వారికి నాపై ఉన్న నమ్మకం మాత్రమే. ఆయనకు సన్నిహితుడైన ఆదికేశవులుని కూడా కాదని నాకు అండగా నిలిచారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బలమైన కులాలకే పరిమితమైన ముఖ్యమంత్రి పదవి ఆయనకు రావటం కేవలం ఆయన ప్రతిభకు గుర్తింపు మాత్రమే’’ అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు పేర్కొన్నారు. 

దైవభక్తి మెండు

కొణిజేటికి అపారమైన దైవభక్తి ఉండేదని సన్నిహితులు చెప్తారు. స్వగ్రామంలో వినాయక గుడి నుంచి శివాలయం, రామాలయం, వేణుకేశవస్వామి, అయ్యప్పస్వామి ఆలయాల నిర్మాణం, అభివృద్ధికి తన వంతు సహకారమందించారు. వేమూరుకు వెళ్లినప్పుడల్లా వినాయకాలయంలో పూజలు చేయించేవారు.  

సీఎం అయినా ఆర్థిక మంత్రి ఛాంబర్‌లోనే!

వైఎస్‌ మరణం తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య కొంతకాలం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఆయనకు సహకారం లభించలేదు. సీఎంగా రోశయ్యను కలవడానికి ఆసక్తి చూపేవారు కాదు. ముఖ్యమంత్రి అయినప్పటికీ మంత్రుల సహకారం లభించడం లేదన్న కారణంతో రోశయ్య సీఎం ఛాంబర్‌కు వెళ్లకుండా ఆర్థికశాఖ మంత్రి ఛాంబర్‌ నుంచే బాధ్యతలు నిర్వహించారు. నాలుగో రోజు అప్పటి ఇరిగేషన్‌ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇరిగేషన్‌ ఫైల్‌తో రోశయ్య వద్దకు వెళ్లి సంతకం చేయించుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఆయన వద్దకు వెళ్లడం ప్రారంభించారు. 

రంగా నన్ను తీర్చిదిద్దారు

‘‘న్యాయశాస్త్రం చదివి న్యాయవాది అవుదామని అనుకున్నా.. ఆ కోరిక నెరవేరలేదు. బీకాంతోనే చదువు ముగించాల్సి వచ్చింది. హిందూ కాలేజీ ఎన్నికల్లో గెలవడం, అప్పుడే మొదలైన ప్రత్యేకాంధ్ర ఉద్యమం నన్ను.. రాజకీయాలకు అతికించేశాయని’’ తన జీవిత విశేషాలతో వెలువరించిన ‘నిలువెత్తు సంతకం’ పుస్తకంలో రోశయ్య వివరించారు. ‘‘ఆచార్య ఎన్జీ రంగాతో నా బంధం అందరికీ తెలిసిందే. ఆయనే నన్ను తీర్చిదిద్దారు. ప్రకాశం పంతులు ప్రభావమూ నాపై ఉంది. నేను గాంధీ కాలం నాటి వాణ్ణి కాదు.. కానీ ఆయన్ను చూసే అదృష్టం కలిగింది...’’ అని రోశయ్య పేర్కొన్నారు.

తమిళనాడు గవర్నర్‌గానూ..

పార్టీకి, ప్రజలకు చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రోశయ్యను 2011 ఆగస్టు 26న తమిళనాడు గవర్నర్‌గా నియమించింది. సాధారణంగా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు... కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆశీస్సులతో గవర్నర్‌గా నియమితులైన వారికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. కానీ తమిళనాడు గవర్నర్‌గాను రోశయ్య తనదైన శైలిలో, ఎలాంటి పొరపొచ్చాలకు తావులేకుండా హుందాగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన కొంత కాలం కర్ణాటకకూ గవర్నర్‌గా పనిచేశారు. 

రైస్‌మిల్లర్‌గా..

రోశయ్య రాజకీయాల్లోకి రాక ముందు కొన్నాళ్లు బియ్యం వ్యాపారం చేశారు. గుంటూరు జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం కార్యదర్శిగా పనిచేశారు. గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నిర్మాణానికి రైస్‌మిల్లర్ల సంఘం నుంచి ఆర్థికసహకారం అందించటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

వేమూరులో భారీ పౌర సన్మానం

తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య పదవీ విరమణ చేసిన తర్వాత... స్వస్థలం వేమూరులో ఆయనకు భారీ పౌర సన్మానం జరిగింది. అప్పట్లో స్థానిక తెదేపా ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో రోశయ్యకు పౌర సన్మానం జరపడంతో పాటు, కమ్యూనిటీ హాల్‌కి, భట్టిప్రోలులో పంచాయతీ భవనానికి ఆయనతో ప్రారంభోత్సవం చేయించారు. రోశయ్య అజాత శత్రువని, ఆయనకు అన్ని పార్టీలవారూ గౌరవం ఇచ్చేవారని చెప్పడానికి ఇదో మెచ్చు తునక. 

పురస్కారాలు... సత్కారాలు..!

> 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. 
2018 ఫిబ్రవరి 11న టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో రోశయ్యను జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది. 

తమిళనాడు గవర్నర్, సీఎం సంతాపం

చెన్నై:  మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం పట్ల తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి, ముఖ్యమంత్రి స్టాలిన్‌లు సంతాపం తెలిపారు. రోశయ్య మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు ఆర్‌.ఎన్‌. రవి పేర్కొన్నారు. అపార అనుభవం కలిగిన రాజనీతిజ్ఞుడైన రోశయ్య మరణం తనను కలచివేసిందని సీఎం స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

రాజకీయాల్లో అజాత శత్రువు- కేటీఆర్, మంత్రి 

వివిధ హోదాల్లో పనిచేసిన రోశయ్య రాజకీయాల్లో అజాతశత్రువు, సౌమ్యుడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్నివర్గాల ప్రజలకు పెద్ద దిక్కు, ఆప్తుడు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా వాడివేడిగా జరిగే సమావేశాల్లోనూ హాస్యోక్తులతో నవ్వులు కురిపించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో నాకు, తెరాస మిత్రులకు వ్యక్తిగతమైన అనుబంధం ఉంది.

కాంగ్రెస్‌ సిద్ధాంతాలే శ్వాసగా పనిచేశారు- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు 

రోశయ్య జీవించినంత కాలం కాంగ్రెస్‌ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పనిచేశారు. ఆయన మరణం తీవ్రంగా కలచివేసింది. రాజకీయాలలో విలువలు, నిబద్ధతకు ఆయన నిదర్శనం. శాసనసభలో ఎక్కువ సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే.

గొప్ప రాజకీయవేత్త- బండారు దత్తాత్రేయ, హరియాణా గవర్నర్‌ 

రోశయ్య మృతితో ఒక సన్నిహితుణ్ని కోల్పోయినట్లుగా ఉంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కర్నూలు జలమయమై భీకర పరిస్థితులు తలెత్తగా, తెల్లవారుజాము 3.30 వరకు సచివాలయంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.  


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని