Nupur Sharma: నుపుర్‌ శర్మ కేసులో.. సుప్రీంకోర్టు ‘లక్ష్మణ రేఖ’ దాటింది..!

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం

Published : 05 Jul 2022 16:10 IST

విమర్శించిన మాజీ న్యాయమూర్తులు

దిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ‘లక్ష్మణ రేఖ’ దాటిందని.. దాన్ని సరిదిద్దేందుకు తక్షణ చర్యలు అవసరమని కొంతమంది మాజీ న్యాయమూర్తులు, అధికారులు విమర్శించారు. ఈ మేరకు 15 మంది మాజీ న్యాయమూర్తులు, 77 మంది ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ మాజీ అధికారులు, సాయుధ బలగాలకు చెందిన 25 మంది రిటైర్డ్‌ అధికారులు బహిరంగ లేఖ రాశారు.

‘‘దేశంలోని అన్ని సంస్థలు రాజ్యాంగం ప్రకారం తమ విధులను నిర్వర్తిస్తేనే ప్రజాస్వామ్యం చెక్కుచెదరకుండా ఉంటుందని మేం అభిప్రాయపడుతున్నాం. ఇటీవల సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు (నుపుర్‌ శర్మ కేసులో జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ) లక్ష్మణరేఖను దాటాయి. అందువల్లే మేం ఈ బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ వ్యాఖ్యలు దేశం లోపల, వెలువల అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. న్యాయస్థానాల నుంచి ఇలాంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు.. అతిపెద్ద ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థపై చెరగని మచ్చ వేస్తాయి. ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రతపై ఇవి తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశమున్నందున.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం. ఈ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయాలు న్యాయపరమైన విలువలకు లోబడి లేవు. కోర్టు తీర్పులో భాగం కానీ ఈ వ్యాఖ్యలు.. న్యాయబద్ధతను అపవిత్రం చేస్తాయి’’ అని ఈ బృందం తమ ప్రకటనలో వెల్లడించింది.

‘‘ఆ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు.. పిటిషనర్‌ లేవనెత్తిన సమస్యతో సంబంధం లేకుండా ఉన్నాయి. అంతేగాక, న్యాయపరంగా అన్ని నిబంధనలు అతిక్రమించేలా ఉన్నాయి. ఈ కేసులో ఆమె తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే చోటుకు బదిలీ చేయాలని కోరింది. కానీ, ఇందులో ఆమెకు న్యాయం దక్కలేదు. నుపుర్‌ కేసును ఎందుకు విభిన్నంగా చూశారన్నది ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం. ఇలాంటి ఘటనలు సుప్రీంకోర్టు పవిత్రత, గౌరవంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి’’ అని మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విమర్శలకు కారణమేంటంటే..

ఓ టీవీ చర్చలో మహమ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. అయితే ఎఫ్‌ఐఆర్‌లను ఒకటిగా చేయాలంటూ నుపుర్‌ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పర్దీవాలాల ధర్మాసనం.. నుపుర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని పేర్కొంది. చౌకబారు ప్రచారం కోసం లేదా రాజకీయ ఎజెండా కోసం లేదా నీచ కార్యకలాపాల కోసం ఏమైనా చేస్తారా? అని ఆక్షేపించింది. ఈ వ్యాఖ్యలకు గానూ దేశం మొత్తానికి నుపుర్‌ క్షమాపణలు చెప్పాలని తెలిపింది. ఈ తీవ్ర వ్యాఖ్యలపైనే మాజీ అధికారులు, మాజీ న్యాయమూర్తులు విమర్శలు చేశారు.

ఇదీ చదవండి: నుపుర్‌ శర్మ దేశాన్ని రెచ్చగొట్టారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని