మళ్లీ ఎగిరొస్తున్న చీతాలు

దాదాపు 74 ఏళ్ల తర్వాత గతేడాది భారత్‌లోకి మళ్లీ చీతాలు ప్రవేశించగా.. ఇప్పుడు వాటి సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 28 Jan 2023 04:30 IST

ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12

జొహనెస్‌బర్గ్‌/దిల్లీ: దాదాపు 74 ఏళ్ల తర్వాత గతేడాది భారత్‌లోకి మళ్లీ చీతాలు ప్రవేశించగా.. ఇప్పుడు వాటి సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చేందుకు ఆ దేశంతో ఒప్పందం చేసుకుంది. ఫిబ్రవరి నెలలో ఈ చీతాలు భారత్‌కు రానున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య గత వారం ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఏడు మగ, అయిదు ఆడ చీతాలను ఫిబ్రవరి 15న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ‘‘ఈ 12 చీతాలు గత ఆరు నెలలుగా దక్షిణాఫ్రికాలో ప్రత్యేక క్వారంటైనులో ఉన్నాయి. ఈ నెలలోనే అవి భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆలస్యమైంది’’ అని అధికారి వివరించారు. అటు దక్షిణాఫ్రికా పర్యావరణ విభాగం కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే పదేళ్లలో భారత్‌కు పదుల సంఖ్యలో చీతాలను అందించేందుకు అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపింది. తొలి జట్టు కింద 12 చీతాలను ఫిబ్రవరిలో పంపనున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని