సంక్షిప్త వార్తలు(15)
ప్రధాని నరేంద్ర మోదీ 2019 నుంచి 21 సార్లు విదేశీ పర్యటనలు చేశారని, ఇందుకు ప్రభుత్వం రూ.22.76 కోట్లు ఖర్చు చేసిందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ గురువారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
నాలుగేళ్లలో మోదీ 21 విదేశీ పర్యటనలు
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 2019 నుంచి 21 సార్లు విదేశీ పర్యటనలు చేశారని, ఇందుకు ప్రభుత్వం రూ.22.76 కోట్లు ఖర్చు చేసిందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ గురువారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 21 పర్యటనల్లో మోదీ జపాన్‌కు 3 సార్లు, అమెరికాకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెరో రెండుసార్లు వెళ్లినట్లు తెలిపారు.
సిక్కింలో ప్రతి జననానికి 100 మొక్కలు
గ్యాంగ్‌టక్: సిక్కింలో పుట్టే ప్రతి బిడ్డకు గుర్తుగా 100 మొక్కల చొప్పున నాటనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ ప్రకటించారు. ‘మేరే రఖ్ మేరే సంతతి’ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు. తల్లిదండ్రులు, చిన్నారులు, ప్రకృతి మధ్య బలమైన అనుసంధాన్ని ఏర్పర్చడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు.
ఉగ్రవాదిగా మారిన ఉపాధ్యాయుడి అరెస్ట్
జమ్ము: వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులతో వెళుతున్న బస్సులో బాంబును పేల్చిన ఘటన సహా పలు కేసులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరెస్టు అయ్యాడు. ఈ మేరకు జమ్మూ-కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ గురువారం వెల్లడించారు. రియాసీ జిల్లాకు చెందిన ఆరీఫ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ లష్కరే తొయిబాతో సంబంధాలు పెట్టుకొని పలుచోట్ల ఉగ్రవాద కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. గత ఏడాది మే నెలలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే బస్సులో బాంబు పెట్టి పేల్చివేసిన ఘటనలో నలుగురు యాత్రికులు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. జమ్మూలోని నర్వాల్ జిల్లాలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో దర్యాప్తు సందర్భంగా ఆరీఫ్‌ను అరెస్ట్ చేసినట్లు డీజీపీ తెలిపారు. అతని వద్ద అధునాతన ఐఈడీ పేలుడు పదార్థంతో నింపి ఉన్న ఒక పెర్ఫ్యూమ్ సీసాను గుర్తించామని చెప్పారు. ఇలాంటిది లభించడం ఇదే తొలిసారని పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
గృహ హింస చట్టం భర్తకు రక్షణ కల్పించదు
దిల్లీ హైకోర్టు వెల్లడి
దిల్లీ: క్రూరత్వం నుంచి వివాహితలకు రక్షణ కల్పించడమే గృహ హింస చట్టం లక్ష్యమని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కుటుంబంలోని పురుష సభ్యులకు, ముఖ్యంగా భర్తకు అది రక్షణ కల్పించదని అభిప్రాయపడింది. గృహ హింస చట్టం కింద భర్త తనపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ ఓ మహిళ దిల్లీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానిపై విచారణ ప్రారంభించిన జస్టిస్ జస్మీత్ సింగ్ ధర్మాసనం.. ‘‘గృహ హింస చట్టంలోని సెక్షన్-12 కింద పిటిషన్‌దారుపై ఆమె భర్త చర్యలు కోరారు. కానీ సెక్షన్-2(ఎ) ప్రకారం.. కుటుంబంలోని పురుష సభ్యుడికి, ముఖ్యంగా భర్తకు ఆ చట్టం వర్తించదనిపిస్తోంది. కాబట్టి తదుపరి విచారణ (ఈ నెల 14వ తేదీ) వరకు పిటిషన్‌దారుపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశిస్తున్నాం’’ అని పేర్కొంది.
సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారానే ‘ఐఆర్‌ఎంఎస్’ ఎంపికలు
ప్రత్యేక పరీక్ష నిర్వహణపై వెనక్కు తగ్గిన రైల్వే మంత్రిత్వ శాఖ
దిల్లీ: ఈ ఏడాది భారతీయ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఐఆర్‌ఎంఎస్) అధికారుల ఎంపికలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారానే చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఎంపికలకు యూపీఎస్సీ ద్వారా ప్రత్యేకంగా ఐఆర్‌ఎంఎస్ పరీక్ష నిర్వహించాలని ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు గురువారం తెలిపింది. ఈ మార్పునకు దారితీసిన కారణాలను రైల్వే శాఖ వెల్లడించలేదు. ఇంజినీరింగేతర క్యాడర్ల అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.
కార్మికుల మృతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
ఈనాడు, దిల్లీ: కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొని కార్మికులు మృత్యువాత పడుతుండడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. 2017 నుంచి 2022 వరకు దేశంలోని వివిధ కర్మాగారాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో సగటున రోజుకు ముగ్గురు చనిపోవడంతో పాటు 11 మంది గాయపడుతున్నారని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. కేవలం 2018-20ల మధ్యనే ప్రమాదాల్లో 3,331 మంది చనిపోతే బాధ్యులుగా కేవలం 14 మందికి జైలు శిక్షపడిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. ఈ ప్రమాదాలన్నీ ఫ్యాక్టరీల చట్టం కింద నమోదైన కర్మాగారాల్లో చోటు చేసుకున్నాయని, దేశంలో అసంఘటిత రంగంలో ఉన్న 90 శాతం కర్మాగారాల్లో పరిస్థితి ఏమిటని సంఘం ప్రశ్నించింది. 2017-22 మధ్య కర్మాగారాల్లో ప్రమాదాలపై ఆరువారాల్లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.
రైల్వే ప్రయాణికులు పెరిగారు.. ఆదాయం పెరిగింది
దిల్లీ: వందే భారత్ రైళ్ల ప్రారంభంతో కొత్త శకం మొదలుపెట్టిన రైల్వే శాఖ.. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల ద్వారా ప్రయాణికులను పెంచుకోవడమే కాకుండా ఆదాయాన్ని భారీగా ఆర్జించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 జనవరి మధ్య ప్రయాణికుల రైల్వేకు సంబంధించి నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ పలు విషయాలను వెల్లడించింది. గత ఏడాదిలో ప్రయాణికులు రైళ్ల ద్వారా మొత్తం ఆదాయం రూ.31,634 రాగా.. అది 73శాతం పెరిగి ఈ ఏడాది 54,733 కోట్లు వచ్చాయి. రిజర్వుడు కోటాలో చూసుకుంటే ఈ ఏడాది 66 కోట్ల మంది ప్రయాణిస్తే రూ.42,945 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది 62 కోట్ల మంది ప్రయాణిస్తే రూ.29,079 కోట్ల ఆదాయం వచ్చింది. అన్‌రిజర్వుడు రైళ్లలో 452 కోట్ల మంది ప్రయాణిస్తే రూ. 11,788 కోట్ల ఆదాయం రాగా.. గత ఏడాది 197 కోట్ల మంది ప్రయాణిస్తే రూ. 2,555 కోట్ల ఆదాయం వచ్చింది. రిజర్వుడు రైల్వే ద్వారా 48శాతం ఆదాయం పెరుగుదల నమోదయితే.. అన్‌రిజర్వుడు ద్వారా 128 శాతం ఆదాయం పెరుగుదల నమోదయింది.
నలుగురికి పునర్జన్మనిచ్చిన జీవన్మృతుడు
దిల్లీ: తీవ్ర వేదనలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం నలుగురికి పునర్జన్మ ఇచ్చింది. దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో జీవన్మృతుడుగా ప్రకటించిన 50 ఏళ్ల బిజేందర్ శర్మ అవయవాలను గురువారం రాజధానిలోని నాలుగు ఆసుపత్రుల్లోని రోగులకు అమర్చారు. ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్’ ద్వారా గుండెను ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలోని ఓ రోగికి, కాలేయాన్ని ఐఎల్‌బీఎస్ ఆసుపత్రిలో ఒకరికి, రెండు మూత్ర పిండాలను ఎయిమ్స్, ఆర్మీ ఆసుపత్రిలోని ఒక్కొక్కరికి వైద్యులు అమర్చారు. కార్నియాలను భద్రపరిచారు. ఫర్నీచర్ డిజైనర్‌గా పనిచేసే శర్మ జనవరి 30న ఇంటికి తిరిగొస్తుండగా ఫరీదాబాద్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో జనవరి 31న ఎయిమ్స్‌కు తీసుకురాగా, పరీక్షించిన వైద్యులు ఆయన్ని జీవన్మృతుడుగా ప్రకటించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న శర్మ కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి చెప్పగా, వారు దానికి అంగీకరించారు. జీవించినంత కాలం అందరికీ సాయపడిన తన తండ్రి- చనిపోతూ కూడా ఇతరుల ప్రాణాలు నిలిపారని శర్మ కుమారుడు మిథిలేశ్ చెప్పారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి అవయవాలను తరలించినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
మీరు లేకుండా మేము మెరుగ్గా ఉన్నాం
మమతపై విశ్వభారతి విశ్వవిద్యాలయం విమర్శ
కోల్‌కతా: అమర్త్యసేనుకు సంబంధించిన భూ వివాదంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత, విశ్వభారతి వర్సిటీ మధ్య రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా దీదీపై విశ్వవిద్యాలయం విమర్శలు గుప్పించింది. ‘‘మీ ఆశీర్వాదం లేకుండా మేం మెరుగైన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మేం ప్రధానమంత్రి మార్గదర్శకంలో ఉన్నాం’’ అంటూ వ్యాఖ్యానించింది. ఇటీవలే బెంగాల్ ముఖ్యమంత్రి వర్సిటీకి సంబంధించిన వివాదాస్పద భూమి యాజమాన్య హక్కు పత్రాలను నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌కు అందించారు. అనంతరం మమతను విమర్శిస్తూ వర్సిటీ ఈ ప్రకటన విడుదల చేసింది.
2027-28 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పనగడియా
న్యూయార్క్: వృద్ధి ప్రస్థానంలో భారత్ దూసుకుపోయి 2027-28 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా చెప్పారు. ఆర్థిక సర్వేను పరిశీలిస్తే భారత్ 6.5% కంటే ఎక్కువ వృద్ధిరేటునే నమోదు చేస్తుందని ఒక వార్తాసంస్థ ముఖాముఖిలో ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నప్పటికీ 7% పైబడిన వృద్ధిరేటుతో భారతదేశం ముందుకు దూసుకువెళ్తుందని అంచనా వేశారు. 2003లో 8% వృద్ధిరేటుకు చేరువగా కొన్నాళ్లు ఉందనీ, ఇప్పుడు అలాంటి సానుకూలతే కనిపిస్తోందని చెప్పారు. కొవిడ్ ఉద్ధృతి సమయంలో చేపట్టిన పలు సంస్కరణల వల్ల ఈ అంచనాలు సాధ్యమేనన్నారు. ‘‘ఎన్నికల్లో ప్రజాకర్షక ప్రకటనలు లేవు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. బ్యాంకుల బ్యాలెన్సు షీట్లు బాగున్నాయి. విశ్వసనీయమైన ప్రభుత్వం ఉంది. వీటన్నింటివల్ల ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది’’ అని పనగడియా చెప్పారు.
ఎస్పీ, ఆర్జేడీల గుర్తింపు రద్దు చేయాలి!
సీఈసీ అపాయింట్‌మెంట్‌్ కోరిన వీహెచ్‌పీ
దిల్లీ: ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను.. ఎన్నికల సంఘం (ఈసీ) వాటి గుర్తింపును రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది. ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య, ఆర్జేడీకి చెందిన చంద్రశేఖర్‌లు ‘రామ్ చరిత్ మానస్’పై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వారిపై ఆయా పార్టీలు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని వీహెచ్‌పీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాజకీయ పార్టీలుగా నమోదైన అవి ‘ప్రాథమిక నిబంధనల’ను ఉల్లంఘించాయని ఆరోపించింది. ఈ మేరకు ఆయా పార్టీల గుర్తింపు రద్దుకు డిమాండ్ చేసేందుకు గాను వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ అపాయింట్‌మెంట్ కోరారు. మౌర్య, చంద్రశేఖర్‌లపై ఆ పార్టీలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఈ మేరకు వారి వ్యాఖ్యలకు అవి మద్దతిస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆలోక్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.
అట్టడుగు వర్గాలకు బడ్జెట్‌లో నిరాశే
బలహీన చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు తక్కువ కేటాయింపులు
హక్కుల సంఘాలు పెదవివిరుపు
దిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో అట్టడుగు వర్గాలకు నిరాశే మిగిలిందని గురువారం పలు హక్కుల సంఘాలు పెదవివిరిచాయి. బలహీన చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధులకు బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులు చేశారని ఆరోపించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ వర్గానికి 1శాతం మాత్రమే నిధుల కేటాయింపు జరిగిందని.. గత బడ్జెట్‌లోని రూ.196 కోట్లను సైతం వినియోగించలేదని వికలాంగ హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్డీ) వెల్లడించింది. ఇందిరాగాంధీ జాతీయ దివ్యాంగుల పింఛనుకు అదనంగా ఎలాంటి నిధులు కేటాయించలేదని.. పింఛను కింద ఇచ్చే రూ.300ను గత దశాబ్దం నుంచి పెంచలేదని తెలిపింది. పన్ను మినహాయింపుల విషయంలో వృద్ధులకు ఉన్న ఆంక్షలను తొలగించాలని హెల్ప్‌ఏజ్ ఇండియా వ్యాఖ్యానించింది. గత ఏడాదితో పోలిస్తే చిన్నారుల బడ్జెట్‌లో 0.05శాతం తగ్గిందని క్రై హక్కు సంస్థ పెదవివిరిచింది.
137 మంది భక్తులకు అస్వస్థత
పంఢర్‌పుర్‌లో ఘటన
పుణె: మహారాష్ట్ర శోలాపుర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంఢర్‌పుర్‌లో 137 మంది విట్ఠల్ పాండురంగ భక్తులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాఘ మాస ఏకాదశి సందర్భంగా బుధవారం స్థానిక మఠంలో ఊదలతో తయారు చేసిన ఓ వంటకాన్ని వారు ఆరగించారు. అనంతరం వారికి వాంతులు మొదలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆహారం కలుషితం కావడమే దీనికి కారణం అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 89 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలినవారు ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.
హమాలీగా మాజీ హాకీ క్రీడాకారుడు
కోచ్ ఉద్యోగానికి పంజాబ్ సీఎం హామీ
చండీగఢ్: హమాలీగా పనిచేస్తూ పొట్టపోసుకొంటున్న పరంజీత్ అనే మాజీ హాకీ క్రీడాకారుడికి క్రీడల విభాగంలో కోచ్ ఉద్యోగం ఇస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం తాను పరంజీత్‌తో మాట్లాడుతున్న వీడియోను మాన్ ట్విటర్‌లో పంచుకున్నారు.
గ్యాస్ బకాయిల వసూలుకు బలవంతంగా ప్రీపెయిడ్ మీటర్లు
బ్రిటన్ గ్యాస్ సరఫరా సంస్థ క్షమాపణ
లండన్: బ్రిటన్‌లో వంట గ్యాస్ బిల్లుల బకాయిలున్న కొందరు వినియోగదారుల ఇళ్లలోకి ఓ థర్డ్ పార్టీ సంస్థ ఏజెంట్లు బలవంతంగా ప్రవేశించి, ప్రీపెయిడ్ మీటర్లు బిగించారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలు గ్యాస్ సదుపాయానికి దూరం అవుతారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు బ్రిటన్ ఇంధన నియంత్రణ సంస్థ ‘ది ఆఫీస్ ఆఫ్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్స్(ఆఫ్‌జెమ్)’ గురువారం ప్రకటించింది. టైమ్స్ ఆఫ్ లండన్ వార్తా సంస్థ పేర్కొన్న కథనం ప్రకారం.. గ్యాస్ సరఫరా సంస్థ బ్రిటిష్ గ్యాస్ తరఫున బకాయిలు వసూలు చేసే అర్వాటో అనే థర్డ్ పార్టీ సంస్థ ఏజెంట్లు కొందరి ఇళ్లలో ప్రీపెయిడ్ మీటర్లు బిగించారు. దీనిపై బ్రిటిష్ గ్యాస్ సంస్థ క్షమాపణలు చెప్పింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP Govt: పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
-
World News
PM Modi: మోదీ అసాధారణ నేత.. చైనాలో భారీగా ఆదరణ
-
Politics News
Balineni: పట్టభద్రుల్లో అసంతృప్తి నిజమే: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
-
Ap-top-news News
AP Govt: ఎవరి గ్లాసు వారే తెచ్చుకోండి.. రాగి జావ పోస్తాం
-
Politics News
Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. 2024లో పూర్తి సినిమా: నారా లోకేశ్