బీబీసీ డాక్యుమెంటరీ.. రికార్డులు సమర్పించాలంటూ కేంద్రానికి సుప్రీం ఆదేశం

గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని అడ్డుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated : 04 Feb 2023 09:19 IST

దిల్లీ: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని అడ్డుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాల్‌ చేస్తూ, సీనియర్‌ పాత్రికేయుడు ఎన్‌.రామ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కలిసి వేసిన పిటిషన్‌తో పాటు.. మరో న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. మూడు వారాల్లో రికార్డులు సమర్పించాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.  

హిండెన్‌బర్గ్‌ షార్ట్‌ సెల్లర్లపై  విచారణ జరిపించాలంటూ పిల్‌

స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపు షేర్ల విలువ భారీగా పతనమయ్యేలా అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ- హిండెన్‌బర్గ్‌ కృత్రిమ భయాందోళనలు సృష్టించిందంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ వ్యవహారంలో హిండెన్‌బర్గ్‌కు చెందిన షార్ట్‌ సెల్లర్‌ నాథన్‌ అండర్సన్‌తో పాటు భారత్‌, అమెరికాల్లోని ఆయన భాగస్వాములపై విచారణ జరిపించాలని అందులో కోరారు. అదానీ గ్రూపు షేర్ల విలువను కృత్రిమంగా కూలదోయడం ద్వారా దేశంలోని అమాయక మదుపర్లను నిందితులు దోచుకున్నారని ఆరోపించారు. ఎం.ఎల్‌.శర్మ అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చేశారు. స్టాక్‌ మార్కెట్‌లో షార్ట్‌ సెల్లింగ్‌ విధానాన్ని మదుపర్ల పాలిట మోసంగా ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని