బిడ్డకు జన్మనిచ్చిన ‘లింగమార్పిడి’ జంట

ఇదో అరుదైన ఘటన. కేరళకు చెందిన ‘లింగమార్పిడి’ (ట్రాన్స్‌జెండర్‌) జంట జియా పావల్‌, జహాద్‌ బుధవారం ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

Published : 09 Feb 2023 06:04 IST

కోజికోడ్‌: ఇదో అరుదైన ఘటన. కేరళకు చెందిన ‘లింగమార్పిడి’ (ట్రాన్స్‌జెండర్‌) జంట జియా పావల్‌, జహాద్‌ బుధవారం ఓ బిడ్డకు జన్మనిచ్చారు. కోజికోడ్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సిజేరియన్‌ శస్త్రచికిత్స ద్వారా శిశువు పుట్టినట్లు ఈ జంటలో ఒకరైన జియా పావల్‌ వెల్లడించారు. ప్రసవానంతరం శిశువు, జహాద్‌ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. జహాద్‌ తన బిడ్డకు పాలిచ్చే వీలు లేనందున.. ఆసుపత్రి పాల బ్యాంకు ద్వారా వైద్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ జంటను ఫోను ద్వారా అభినందించిన కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జి ఉచితవైద్యం అందించాలని వైద్య కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. దేశ చరిత్రలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన మొదటి ‘ట్రాన్స్‌జెండర్‌’ జంటగా జియా, జహాద్‌ నిలిచారు. అయితే, శిశువు లింగ వెల్లడికి ఈ జంట తిరస్కరించింది. తన జీవిత భాగస్వామి జహాద్‌ ఎనిమిది నెలల గర్భంతో ఉన్నట్లు జియా పావల్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

* కేరళకు చెందిన జహాద్‌, జియా.. ఇద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. జహాద్‌ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌ కాగా, జియా పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించేవాడు. పుట్టుకతో అమ్మాయి అయిన జహాద్‌ లింగమార్పిడి చికిత్స ద్వారా అబ్బాయిగా మారాలని అనుకుంది. మగవాడైన జియా తాను అమ్మాయిగా మారాలని కోరుకున్నాడు. వీరిద్దరి కోరిక మేరకు వైద్యులు హార్మోన్‌ థెరపీ ప్రారంభించారు. చికిత్స మధ్యలో ఉండగా.. ఓ చిక్కు వచ్చి పడింది. ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టిన డాక్టర్లకు ఓ ఆసక్తికర విషయం తెలిసింది. జహాద్‌ అప్పటికే గర్భవతి అని గుర్తించారు. దీంతో తర్జనభర్జన మొదలైంది. జహాద్‌ను అబ్బాయిగా మార్చే చికిత్సను మధ్యలోనే ఆపేశారు. అయితే, దశలవారీగా కొనసాగే చికిత్సలో భాగంగా అప్పటికే ఆమె  వక్షోజాలను వైద్యులు తొలగించారు. మిగిలిన ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి, జహాద్‌ సాధారణ కాన్పుతోనే బిడ్డకు జన్మ ఇవ్వవచ్చని చెప్పారు. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత హార్మోన్‌ థెరపీ కొనసాగించాలని నిర్ణయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు