Odisha Train Accident: 112 టన్నుల బరువు... 130 కి.మీ.వేగం

సాధారణంగా రైలు ఇంజిన్‌ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని పట్టాలపైకి చేర్చేందుకు ఎంతో ప్రయాస పడాల్సి వస్తుంది.

Updated : 04 Jun 2023 07:46 IST

అంతెత్తున గూడ్సుపైకి వెళ్లిన ఇంజిన్‌
లూప్‌లైన్‌లోకి వెళ్లినా తగ్గని కోరమాండల్‌ స్పీడు

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా రైలు ఇంజిన్‌ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని పట్టాలపైకి చేర్చేందుకు ఎంతో ప్రయాస పడాల్సి వస్తుంది. భారీ క్రేన్లతో గంటల తరబడి శ్రమిస్తేనే సాధ్యమవుతుంది. ఒక్కో రైలు ఇంజిన్‌ (లోకోమోటివ్‌) బరువు 108.3 టన్నుల నుంచి 112.8 టన్నుల వరకు ఉంటుంది. అంతటి భారీ బరువుండే రైలు ఇంజిన్‌....ఒడిశా ప్రమాదంలో అమాంతంగా దాదాపు 15 అడుగుల ఎత్తుకు ఎగసి గూడ్సుపైకి ఎక్కడం నిపుణుల్నీ విస్మయానికి గురిచేస్తోంది.  కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన సమయంలో దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు సమాచారం. రైలును లూప్‌లైన్‌కి మళ్లించినప్పుడు వేగం గణనీయంగా తగ్గుతుంది. కానీ కోరమాండల్‌ వేగం ఎందుకు తగ్గలేదన్నది మరో కీలక ప్రశ్నగా మారింది.

గూడ్సు రైలు భారీ బరువు

ప్రయాణికుల రైళ్లలో గరిష్ఠంగా 24 బోగీలుంటాయి. అదేగూడ్సు రైళ్లలో 40-58 వ్యాగన్లు ఉంటాయి. ఒక్కో ఖాళీ వ్యాగన్‌ 25-26 టన్నుల బరువు ఉంటే.. బొగ్గు, సిమెంటు వంటి వాటి బరువు ఒక్కో దాంట్లో మరో 54-60 టన్నుల వరకు ఉంటుంది. దీనిని కోరమాండల్‌ రైలు ఢీకొట్టింది. సాధారణంగా అయితే ముందున్న రైలు తీవ్రంగా దెబ్బతినాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరిగింది. వేగంగా వస్తున్నందునే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ భారీగా దెబ్బతింది. అందులోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుతెచ్చిపెట్టింది. 130 కి.మీ. వేగంతో ఢీకొట్టడంతోనే కోరమాండల్‌ ఇంజిన్‌ గూడ్సుపైకి ఎక్కినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లున్నా..

పాతతరం బోగీల స్థానంలో జర్మన్‌ టెక్నాలజీ, కొత్త రకం ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాఫ్‌మన్‌బుష్‌) బోగీలను రైల్వేశాఖ కొన్నేళ్లుగా ప్రవేశపెడుతోంది. ఈ బోగీలు ఉన్న రైళ్లు ప్రమాదానికి గురైనప్పుడు అతి తక్కువ ప్రాణనష్టమే జరిగింది. కానీ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎల్‌హెచ్‌బీ బోగీలున్నా భారీ ప్రాణనష్టం జరిగింది. ఎల్‌హెచ్‌బీ బోగీలు పట్టాలు తప్పిన సందర్భాలో నష్టాన్ని తగ్గిస్తాయని..చక్రాలు నేలలోకి కూరుకుపోతాయని, బోగీలు ఒకదానిపైకి మరోటి ఎక్కవని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఒడిశా ప్రమాదంలో ఢీకొట్టింది గూడ్సు రైలును కావడం, అది అత్యంత బరువుతో ఉండటం.. కోరమాండల్‌ ప్రమాద సమయంలో 130 కి.మీ. భారీ వేగంతో ఉండటంతోనే ఇంజిన్‌, బోగీలు అమాంతం పైకి లేవడంతో పాటు చెల్లాచెదురయ్యాయని నిపుణులు, రైల్వే అధికారుల నుంచి మరో వాదన వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు