మొదలైన విచారణ

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) విచారణ మొదలైంది. ఆగ్నేయ రైల్వే సర్కిల్‌ కమిషనర్‌ ఎ.ఎం.చౌధరి సోమవారం బహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌లోని ఘటనాస్థలిని సందర్శించారు.

Updated : 06 Jun 2023 07:16 IST

రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన భద్రతా కమిషనర్‌
లోకోపైలట్లు సహా సిబ్బంది నుంచి వివరాల సేకరణ
పునరుద్ధరించిన మార్గంలో యథావిధిగా రైళ్ల రాకపోకలు
రెండు లైన్లూ అందుబాటులోకి
వెనక్కి మళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు
రంగంలో దిగనున్న సీబీఐ

బాలేశ్వర్‌, ఈనాడు-హైదరాబాద్‌: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) విచారణ మొదలైంది. ఆగ్నేయ రైల్వే సర్కిల్‌ కమిషనర్‌ ఎ.ఎం.చౌధరి సోమవారం బహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌లోని ఘటనాస్థలిని సందర్శించారు. ప్రమాదానికి గురైన రైళ్లను, రైలుమార్గం పరిస్థితిని ఆయన ప్రాథమికంగా పరిశీలించారు. కంట్రోల్‌రూం, సిగ్నల్‌రూంలను సందర్శించారు. స్టేషన్‌ మేనేజర్‌తో మాట్లాడారు. ఈ నెల 2వతేదీ రాత్రి జరిగిన దుర్ఘటనలో షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లూపులైన్లో ఆగిఉన్న గూడ్సురైలును ఢీకొట్టడానికి ప్రధాన కారణంగా భావిస్తున్న ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థను కూడా చూశారు. ప్రమాదానికి గురైన కోరమాండల్‌, బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్సు రైలులో విధులు నిర్వర్తించిన లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకోపైలట్లు, ప్రమాదం జరిగిన స్టేషన్‌లో సిగ్నలింగ్‌ సిబ్బంది సహా 55 మందిని విచారణకు పిలిచారు. మూడు రైళ్లలో విధుల్లో ఉన్న పలువురు ఇతర ఉద్యోగులను, ప్రమాదం జరిగిన స్టేషన్‌తోపాటు పక్క స్టేషన్లలో సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఖరగ్‌పుర్‌లో విచారణ కొనసాగనుంది. స్టేషన్‌ సిగ్నల్‌ మెయింటనర్‌, సెక్షన్‌ కంట్రోలర్‌, ఖరగ్‌పుర్‌ డివిజన్‌కు సంబంధించిన సీనియర్‌ డివిజనల్‌ సిగ్నల్‌-టెలికాం ఇంజినీర్‌, బాలాసోర్‌ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్లు సహా టీటీఈలు, ప్యాంట్రీకార్‌ మేనేజర్‌ తదితరుల్ని, ప్రత్యక్ష సాక్షుల్ని విచారణకు పిలిచారు. సీఆర్‌ఎస్‌ అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రమాద కారణాలపై కొద్దిరోజుల్లోనే నివేదిక ఇవ్వనున్నారు. ‘మేం ఇప్పుడే పని ప్రారంభించాం. పూర్తయ్యేందుకు సమయం పడుతుంది. ప్రమాదానికి కచ్చితమైన కారణమేమిటనేది ఆ తర్వాతే తేల్చగలం’ అని సీఆర్‌ఎస్‌ విలేకరులకు తెలిపారు.

ప్రయాణిస్తున్నవారిలో ఉద్విగ్నత

ఆదివారం రాత్రి పునరుద్ధరించిన పట్టాలపై తొలిసారిగా గూడ్సురైలు ప్రయాణించిన సమయంలో అక్కడ ఉన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేతులు జోడించి నమస్కరిస్తూ, డ్రైవర్లకు అభివాదం చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ప్రమాద ఘటనతో చలించిపోయిన ఆయన.. ఆ రైలు వెళ్తున్నప్పుడు మౌనంగా చూస్తూ కనిపించారు. అవిశ్రాంతంగా పనిచేసిన కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉదయం హావ్‌డా-పూరీ వందేభారత్‌ సహా వివిధ రైళ్లు ఆ పట్టాలపై నెమ్మదిగా రాకపోకలు సాగించాయి. అప్‌లైన్‌, డౌన్‌లైన్‌ కూడా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని రైల్వేవర్గాలు ప్రకటించాయి. ఆ మార్గాల్లో రైళ్లు వెళ్తున్నప్పుడు ప్రయాణికులు కిటికీల నుంచి ఉద్విగ్నంగా పరిశీలిస్తూ కనిపించారు. చెల్లాచెదురుగా పడిఉన్న శకలాలను చూసి పలువురికి నోటమాట రాలేదు. మూడురైళ్లు ప్రమాదానికి గురైనచోట గత కొద్దిరోజులుగా మోహరించిన ‘జాతీయ విపత్తు స్పందన దళం’ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బలగాలు తమ కార్యకలాపాలు ముగించాయి. 121 మృతదేహాలను వెలికితీయడంతో పాటు 44 మంది బాధితుల్ని ఈ బలగాలు రక్షించాయని అధికారులు తెలిపారు.

‘నిర్లక్ష్యం’ అభియోగాలతో కేసు నమోదు..

రైలు దుర్ఘటనపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాలేశ్వర్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) స్టేషన్లోనూ కేసు నమోదైంది. కొన్ని పరిణామాలపై అనుమానం ఉండడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ సంస్థ రంగంలో దిగనుంది. నిబంధనల ప్రకారం జీఆర్పీ స్టేషన్లో కేసు ఆధారంగా తిరిగి కేసు నమోదు చేసుకుని విచారణకు చేపట్టనుంది. దీనికోసం దిల్లీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక క్రైం విభాగాన్ని కేటాయించనున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన కొన్ని అంశాల కారణంగానే సీబీఐ విచారణ అవసరమైందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో వ్యవస్థలో జోక్యం చేసుకోనిదే మెయిన్‌లైన్‌కు ఖాయం చేసిన రూటును లూప్‌ లైనుకు మార్చడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

నిలకడగా లోకోపైలట్ల ఆరోగ్యం

భువనేశ్వర్‌: ప్రమాద సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలట్‌గా ఉన్న గుణనిధి మహంతి, సహాయ పైలట్‌ హజారీ బెహరాల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వీరు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘మహంతిని సోమవారం ఐసీయూ నుంచి బయటకు మార్చారు. బెహరాకు తల శస్త్రచికిత్స చేయాల్సి ఉంది’ అని ఆగ్నేయరైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఆదిత్య చౌధరి తెలిపారు. వారినుంచి రైల్వే భద్రత కమిషనర్‌ వాంగ్మూలాలు తీసుకున్నారు.

* రైళ్లు ఢీకొట్టుకోకుండా నివారించడంలో కీలకమైన ‘కవచ్‌’ను ఇంకా ఈ మార్గంలో అందుబాటులోకి తీసుకురాలేదని రైల్వే అధికారులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ స్వదేశీ సాంకేతికతను అనుసంధానం చేసేందుకు ఆగ్నేయ రైల్వే (బాలేశ్వర్‌ మార్గం దీని కిందకే వస్తుంది)కు రూ.468.9 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినా గత మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని