తల్లి-పిండం ఆరోగ్యంగా ఉంటే.. బాలిక గర్భస్రావాన్ని అనుమతించలేం

గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలంటూ ఓ అత్యాచార బాధితురాలి (మైనరు) తరఫున దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 09 Jun 2023 03:55 IST

అత్యాచార బాధితురాలి కేసులో గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్య

అహ్మదాబాద్‌: గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలంటూ ఓ అత్యాచార బాధితురాలి (మైనరు) తరఫున దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి, పిండం ఆరోగ్యంగా ఉన్నట్లయితే.. బాలిక గర్భస్రావానికి అనుమతించడం కుదరదని పేర్కొన్నారు. ఈ కేసులో అత్యాచార బాధితురాలి వయసు 16 ఏళ్ల 11 నెలలు. ఆమె ఏడు నెలల గర్భవతి. ఆ బాలికకు గర్భవిచ్ఛిత్తి చేయించేందుకు అనుమతించాలంటూ ఆమె తండ్రి కోర్టును ఆశ్రయించారు. దానిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సమీర్‌ దవే బుధవారం విచారణ చేపట్టారు. ‘‘బాలిక లేదా పిండంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటేనే గర్భవిచ్ఛిత్తిని అనుమతించే అవకాశాన్ని కోర్టు పరిశీలిస్తుంది. తల్లి-పిండం ఆరోగ్యంగా ఉంటే మాత్రం అలాంటి ఆదేశాలు జారీ చేయడం చాలా కష్టం’’ అని ఆయన పేర్కొన్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఈ నెల 15లోగా తమకు నివేదిక అందజేయాలని రాజ్‌కోట్‌ సివిల్‌ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. వైద్యపరంగా గర్భస్రావాన్ని అనుమతించొచ్చో లేదో తెలియజేయాలన్నారు. బాలిక ఆరోగ్యంపై ఆమె కుటుంబం ఆందోళన చెందుతోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొనడంతో న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘21వ శతాబ్దంలో ఉన్నాం కాబట్టి ఈ ఆందోళనంతా. ఒకసారి మీ అమ్మ, అమ్మమ్మలను అడగండి. అప్పట్లో పెళ్లిళ్లకు గరిష్ఠ వయసు 14-15 ఏళ్లే. 17 ఏళ్లకల్లా తొలి సంతానాన్ని కనేవారు. మీరు మనుస్మృతి చదవలేదేమో..! ఒకసారి చదవండి’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని