Indian Railways: రైల్వే సిగ్నల్‌ వ్యవస్థకు ఇక రెండేసి తాళాలు

రైళ్లు నడవడంలో కీలకంగా నిలిచే వ్యవస్థలపై ఇకపై రెండేసి తాళాలు వేసి భద్రంగా చూసుకోవాలని రైల్వేబోర్డు ఆదేశించింది.

Updated : 11 Jun 2023 08:43 IST

దిల్లీ: రైళ్లు నడవడంలో కీలకంగా నిలిచే వ్యవస్థలపై ఇకపై రెండేసి తాళాలు వేసి భద్రంగా చూసుకోవాలని రైల్వేబోర్డు ఆదేశించింది. రైళ్ల నియంత్రణ వ్యవస్థలు ఉండే రిలేరూంలు, లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద సిగ్నలింగ్‌-టెలికమ్యూనికేషన్ల పరికరాలను ఉంచే ‘రిలే హట్‌’లు, పాయింట్‌/ ట్రాక్‌ సర్క్యూట్‌ సిగ్నళ్ల వద్ద ఈ మేరకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని శనివారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపింది. ఈ నెల 2న ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం సంభవించడానికి సిగ్నల్‌ వ్యవస్థలో ఎవరో చొరబడడమే కారణమని ప్రాథమికంగా తేలిన నేపథ్యంలో రైల్వేబోర్డు వరసగా పలు ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది. రిలేరూంలోకి ఎవరైనా వెళ్లగలిగితే సిగ్నలింగ్‌లో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇలాంటి పరిస్థితుల్లోనే లూప్‌లైన్లోకి వెళ్లిందని తాజా ఉత్తర్వు పరోక్షంగా ప్రస్తావించింది. ఇంటర్‌లాకింగ్‌లో ఎవరో వేలు పెట్టినట్లు సాక్ష్యాలు చాటుతున్నందువల్ల దానిని లోపరహితంగా తయారు చేయడమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు. రెండు తాళాల వ్యవస్థను ఏర్పాటుచేసేవరకు ప్రస్తుతం ఉన్న ఒకే తాళాన్ని స్టేషన్‌ మాస్టర్‌ వద్ద భద్రపరచాలని బోర్డు ఉత్తర్వులు ఆదేశిస్తున్నాయి. ఏ విభాగం తాళాలను ఎవరు తీశారు, ఎవరు వేశారు అనేవి పట్టికలో స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. బాలేశ్వర్‌ సమీపంలోని బహానగాబజార్‌ స్టేషన్‌ వద్ద ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థను వేరే పనుల కోసం తాత్కాలికంగా మూసివేసినప్పుడు, పునరుద్ధరించినప్పుడు స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం ఇచ్చినట్లు చూపిస్తున్నా పని నిజంగా పూర్తికాక టెక్నీషియన్‌ ఒకరు లొకేషన్‌ బాక్సును గ్రీన్‌సిగ్నల్‌ చూపేలా మార్చారని అధికారులు తెలిపారు. ఇలాంటివి జరగకుండా సాంకేతికంగా ఏమేం చేయాలో సవివరంగా తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని