కోర్టులో రాజకీయాలు వద్దు

కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.

Published : 09 May 2024 04:17 IST

పశ్చిమబెంగాల్‌ కేసులో సుప్రీం వ్యాఖ్య

దిల్లీ: కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం  అనుమతిని ఉపసంహరించుకొన్నా, సీబీఐ తన దర్యాప్తును  కొనసాగిస్తూనే ఉందంటూ బెంగాల్‌ సర్కారు పిటిషనులో ఆక్షేపించింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మేము చట్టపరమైన అంశాలు మాత్రమే నిర్ణయిస్తాం. రాజకీయ వాదనలకు ఇటు కేంద్రాన్ని కానీ, అటు రాష్ట్రాన్ని కానీ అనుమతించం’’ అని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఈ దావా నిర్వహణపై ధర్మాసనం తన తీర్పును రిజర్వులో ఉంచింది. పశ్చిమబెంగాల్‌ సర్కారు తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌.. 2018 నవంబరు 16నే రాష్ట్ర ప్రభుత్వం తన అనుమతిని ఉపసంహరించుకుందని, మళ్లీ విచారణ పేరుతో తమ దర్యాప్తు సంస్థను కేంద్రం రాష్ట్రంలోకి అనుమతించడం తగదన్నారు. సీబీఐపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ విభాగాలకు ఎలాంటి పర్యవేక్షణ పరమైన నియంత్రణలు ఉండవని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని