పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!

జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

Updated : 09 May 2024 05:47 IST

రూ.లక్ష జరిమానా కట్టండి
కేజ్రీవాల్‌ అరెస్టుపై పిల్‌ వేసిన పిటిషనర్‌కు సుప్రీం ఆదేశం

దిల్లీ: జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పిల్‌ వేసిన న్యాయవాది శ్రీకాంత్‌ ప్రసాద్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ప్రస్తుతం కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రాజీనామా చేయాలంటూ సీఎంపై ఒత్తిడి తెచ్చేలా ప్రకటనలు చేయకుండా దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ను నిరోధించాలని కూడా పిల్‌లో పిటిషనర్‌ కోరారు. ఈ అభ్యర్థనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇప్పటికే తన అరెస్టుపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని, ఈ అంశం అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉందని, కాబట్టి జైలు నుంచి ప్రభుత్వం నడపాలన్న ఆదేశాలివ్వలేమని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ‘‘మేం ఏం చేయాలి? అత్యయిక పరిస్థితిని విధించాలా..? పత్రికలను, రాజకీయ ప్రత్యర్థులను మేం ఎలా అడ్డుకుంటాం. ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని మేం ఎలా చెప్పగలం’’ అంటూ పిల్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ సింగ్‌, జస్టిస్‌ మన్‌మీత్‌ పీఎస్‌ అరోరా ధర్మాసనం కొట్టివేసింది. దిల్లీ మద్యం విధానం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని, బెయిలివ్వాలంటూ దాఖలైన పలు పిల్‌లను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిలివ్వాలంటూ కోరిన కరణ్‌పాల్‌ సింగ్‌ అనే న్యాయవాదికి కోర్టు రూ.75,000 జరిమానా కూడా విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని