Jammu Kashmir: పాలిథిన్‌ వ్యర్థాలు అప్పగించండి.. బంగారు నాణెం పట్టుకెళ్లండి!

జమ్మూ- కశ్మీర్‌లోని ఓ గ్రామంలో పాలిథిన్‌ వ్యర్థాల బహిరంగ పారబోతకు చెక్‌ పెట్టేందుకు సర్పంచి వినూత్న ఆలోచన అమలు చేస్తున్నారు. 20 క్వింటాళ్ల పాలిథిన్‌ వ్యర్థాలను తీసుకొస్తే.. బదులుగా బంగారు నాణెం అందజేస్తున్నారు.

Published : 17 Feb 2023 00:35 IST

శ్రీనగర్: పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో పాలిథిన్‌(Polythene) వ్యర్థాల నిర్వహణదీ కీలక పాత్ర. స్థానికులను ఈ దిశగా ప్రోత్సహించేందుకు తన గ్రామంలో వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారో సర్పంచి. పాలిథిన్‌ వ్యర్థాలను తీసుకొచ్చి అప్పగిస్తే.. బదులుగా బంగారు నాణెలు(Gold Coins) ఇస్తున్నారు. జమ్మూ- కశ్మీర్‌(Jammu Kashmir) అనంతనాగ్‌ జిల్లాలోని సదివార గ్రామంలో ఇది అమలవుతోంది. గతేడాది నుంచే గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణకు ఇళ్లలోనే చెత్త గుంతలు నిర్మించేలా సర్పంచి ఫారూక్ అహ్మద్ గనాయి గ్రామస్థులను ఒప్పించారు. అయితే, పాలిథిన్ వ్యర్థాలు కుళ్లిపోకుండా అలాగే మిగిలిపోతుండటంతో ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

20 క్వింటాళ్ల పాలిథిన్ వ్యర్థాలు తీసుకొచ్చేవారికి ఓ బంగారు నాణెం ఇస్తున్నట్లు గనాయి తెలిపారు. తక్కువ మొత్తంలో తీసుకొచ్చినా.. తగిన రివార్డు లేదా వెండి నాణెలు అందజేస్తున్నట్లు చెప్పారు. స్థానిక యువ క్లబ్‌ దీనికి సహకరిస్తోందని వెల్లడించారు. ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలు.. పొలాలు, నీటి వనరుల్లో చేరుకోవడాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘పరిసరాల పరిశుభ్రతపై దృష్టిసారించకపోతే రాబోయే పదేళ్లలో స్థానికంగా సారవంతమైన భూమి, స్వచ్ఛమైన నీటి వనరులు కనిపించవు’ అని ఆయన ఓ వార్తాసంస్థకు తెలిపారు.

గనాయి ఆలోచన సత్ఫలితాలు ఇవ్వడంతో.. జిల్లా యంత్రాంగం త్వరలోనే అనంతనాగ్‌లోని ఇతర గ్రామాల్లోనూ దీన్ని అమలు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ‘మా గ్రామాలు బహిరంగ చెత్త, పాలిథిన్ రహితంగా ఉండేలా.. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం’ అని అనంతనాగ్ ఏసీడీ రియాజ్ అహ్మద్ షా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని