Covishield: 16 దేశాల్లో ప్రవేశానికి అనుమతి

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా టీకా కొవిషీల్డ్‌ను ఐరోపా సమాఖ్యలో 16 దేశాలు గుర్తించడం గొప్ప శుభవార్త అని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

Updated : 23 Jul 2021 12:46 IST

సీరం సీఈవో అదర్‌ పూనావాలా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా టీకా కొవిషీల్డ్‌ను ఐరోపా సమాఖ్యలో 16 దేశాలు గుర్తించడం గొప్ప శుభవార్త అని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ట్వీట్‌ చేశారు. భారత్‌ నుంచి ఆయా దేశాలకు వెళ్లే ప్రయాణికులు స్థానిక నిబంధనలను స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. 

‘‘ 16 ఐరోపా దేశాలు కొవిషీల్డ్‌ తీసుకొన్నపర్యాటకుల రాకకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఈ టీకా తీసుకొన్నవారు తమ దేశాల్లోకి రావచ్చని పేర్కొన్నాయి. ఇది నిజంగా పర్యాటకలు ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త. ఒక దేశానికి మరొక దేశానికి  మధ్య నిబంధనలు మారుతుంటాయి. మీరు టీకా తీసుకొన్నప్పటికీ.. ప్రయాణానికి ముందే ఆ దేశ స్థానిక నిబంధనలు స్పష్టంగా తెలుసుకోండి’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 

ఈ టీకా తీసుకొన్నవారికి ఐరోపా సమాఖ్య దేశాల్లో అనుమతులు లభించకపోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. ఆ తర్వాత నుంచి మెల్లగా కొన్ని దేశాలు ఈ టీకా తీసుకొన్నవారిని అనుమతించడం మొదలుపెట్టాయి. వీటిల్లో ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా,ఫిన్లాండ్‌,జర్మనీ,గ్రీస్‌,హంగేరీ,ఐస్‌ల్యాండ్,ఐర్లాండ్‌,లాత్వియా, నెదర్లాండ్స్‌,స్లొవేనియా,స్పెయిన్‌,స్వీడన్‌,స్విట్జర్లాండ్‌ ఉన్నాయి. తాజాగా ఫ్రాన్స్‌ కూడా ఆమోద ముద్రవేసింది. భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవిషీల్డ్‌ పేరుతో తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ప్రయాణికులను ఆదివారం నుంచి అనుమతిస్తామంటూ ప్రకటించింది. 

కొవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి ఐరోపా సంఘం(ఈయూ) దేశాల్లో పర్యటించే విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఇటీవల సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా స్పందించారు. ట్విటర్ వేదికగా భారత్‌ ప్రయాణికులకు భరోసా ఇచ్చారు. ‘కొవిషీల్డ్ తీసుకున్న భారతీయులు ఐరోపా దేశాలకు ప్రయాణించే విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నాకు తెలిసింది. దీనిని ఉన్నత స్థాయి వర్గాల దృష్టికి తీసుకెళ్లాను. ఆయా దేశాలకు చెందిన నియంత్రణ సంస్థలు, దౌత్య స్థాయిలో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం’ అని అదర్ ట్వీట్ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని