Missile Fire: మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైంది.. : రాజ్‌నాథ్ సింగ్‌

భారత క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ వెల్లడించారు.

Updated : 21 Nov 2022 15:28 IST

ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడి

దిల్లీ: భారత క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం పొరపాటున దూసుకెళ్లిన క్షిపణి.. పాకిస్థాన్‌ భూభాగంలో కూలిన ఘటనపై మంగళవారం ఆయన పార్లమెంట్‌లో స్పందించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలియజేశారు.

‘మన ఆయుధ వ్యవస్థ భద్రతకు మేం అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఈ క్రమంలో ఏదైనా లోపం కనిపిస్తే.. వెంటనే సరిదిద్దుకుంటాం. మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైంది. సురక్షితమైంది. దీనిపై నేను సభావేదికగా హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మన భద్రతా విధానం, ప్రొటోకాల్స్ ఉన్నతస్థాయిలో ఉన్నాయి. మన బలగాలు సుశిక్షితమైనవే కాకుండా క్రమశిక్షణ కలిగి ఉంటాయి. ఈ తరహా వ్యవస్థలను నిర్వహించడంలో మంచి అనుభవం కలిగి ఉన్నాయి’ అని రాజనాథ్ సింగ్ వెల్లడించారు.

అలాగే ఈ ఘటనను ఉద్దేశిస్తూ.. మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఈ క్షిపణి పాకిస్థాన్‌ భూభాగంలోకి దూసుకెళ్లిందని తర్వాత తెలిసింది. అయితే ఈ క్షిపణి కారణంగా ఎవరూ గాయపడలేదని తెలిసి తేలికపడ్డాం. కేంద్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాం. ఈ దర్యాప్తులో ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి’ అని వివరించారు.

కాగా, క్షిపణి దూసుకొచ్చిన ఘటనపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత భూభాగం నుంచి తమ గగనతలంలోకి సూపర్‌ సోనిక్‌ వేగంతో వస్తువు ఒకటి వేగంగా దూసుకొచ్చి కూలిపోయిందని, దీని వల్ల పౌరుల ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఆరోపించింది. పారదర్శకమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ఆ వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం.. విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని