EPFO: అధిక పెన్షన్‌పై సుప్రీం తీర్పును పరిశీలిస్తున్నాం: కేంద్రం

ఈపీఎఫ్‌ (EPF) చందాదారుల పెన్షన్‌ పథకానికి సంబంధించి సుప్రీంకోర్టు (Supreme court) ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇందులో కొన్ని చిక్కులు ఉన్నట్లు పార్లమెంట్‌కు బదులిచ్చింది.

Updated : 22 Dec 2022 19:24 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం (EPS‌)- 2014 సవరణపై సుప్రీంకోర్టు (Supreme court) ఇచ్చిన తీర్పును అధ్యయనం చేస్తున్నామని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2014 సవరణకు ముందు అధిక పింఛను పొందేందుకు ఈపీఎస్‌లో చేరని వారికి సుప్రీంకోర్టు నాలుగు నెలల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని తెలిపారు. పెన్షన్‌ పథకంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలుసా? అంటూ వచ్చిన మరో ప్రశ్నకూ ఆయన బదులిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయ, ఆర్థిక, గణాంకాలకు సంబంధించిన చిక్కులు ఉన్నాయని ఆ సమాధానంలో పేర్కొన్నారు.

ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. అంతకు మించి పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌లో చేరేందుకు ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్‌లో జమ చేయాలి. కానీ ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు గరిష్ఠ గడువు తేదీ ఏమీ చెప్పలేదు. 2014లో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచుతూ కేంద్రం సవరణ చేసింది. దీనికి ముందు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు.. ఆరు నెలల్లోగా అధికవేతనంపై ఈపీఎస్‌లో చేరేందుకు ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. అప్పుడు ఆప్షన్‌ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు నవంబర్‌లో ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగ విరమణ తర్వాత అధిక పింఛన్‌ పొందేందుకు ఈపీఎఫ్‌ (EPF) చందాదారులకు అవకాశం కల్పిస్తూ తీర్పు వెలువరించి నెల రోజులు దాటింది. అయితే, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన నిబంధనలను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఇప్పటివరకు జారీ చేయలేదు. దీంతో అధిక పింఛన్‌ వస్తుందన్న ఆశ ఎప్పుడు ఫలిస్తుందోనని చందాదారులు ఆందోళన చెందుతున్నారు.

ఈపీఎఫ్‌ఓ దగ్గర ఈ ఏడాది మార్చి 31 నాటికి కార్పస్‌ ఫండ్‌ కింద రూ.18,64,136 కోట్లు ఉందని కేంద్రమంత్రి తేలి పార్లమెంట్‌కు తెలిపారు. ఇందులో రూ.11,37,096.72 కోట్లు ఎంప్లాయీ ప్రావిడెండ్‌ ఫండ్‌ స్కీమ్‌, 1962లో ఉండగా.. రూ.6,89,210.72 కోట్లు పెన్షన్‌ స్కీమ్‌, 1995లో ఉన్నాయి. మరో రూ.37,828.56 కోట్లు ఎంప్లాయీ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌, 1976లో ఉన్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని