Punjab: ఖలిస్థాన్‌ నినాదాలు మళ్లీ వినిపిస్తున్నాయ్‌: అమరీందర్‌ సింగ్‌

పంజాబ్‌ను విభజించి ప్రత్యేక ఖలిస్థాన్‌ దేశంగా ఏర్పాటు చేయాలన్న నినాదాలు మళ్లీ వినిపిస్తున్నాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Published : 02 Oct 2022 01:32 IST

ఛండీగఢ్‌: పంజాబ్‌లో ఆప్‌ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ‘ఖలిస్థాన్‌’ ఉద్యమం మళ్లీ మొదలవుతోందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత అమరీందర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు.‘‘ ఇటీవల కాలంలో ఖలిస్థాన్‌ నినాదాలు ఎక్కువవుతున్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరగకుండా తగిన చర్యలు తీసుకున్నాను. కానీ, ప్రస్తుత ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసింది’’ అని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అమరీందర్‌ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పంజాబ్‌ రాష్ట్రాన్ని విభజించి సిక్కుల కోసం ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని గతంలో ఆందోళనలు జరిగాయి.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళలను అణిచివేశాయి. రెండు నెలల క్రితం హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ప్రధాన గేటువద్ద ఖలిస్థాన్‌ జెండాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రత్యేక ఖలిస్థాన్‌ ఏర్పాటు చేయాలంటూ విదేశాల్లోని భారత్‌కు చెందిన సిక్కులు  ఆందోళనలు చేపడుతున్నారు. ఇటీవల ప్రత్యేక ఖలిస్థాన్‌ డిమాండ్‌పై కెనడాలో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టడం కలకలం రేపింది. ‘ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌( ఎస్‌ఎఫ్‌జే) అనే ఖలిస్థానీ అనుకూల సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని