Harbhajan Singh: భజ్జీ నెక్స్ట్‌ ఇన్నింగ్స్‌.. పాలిటిక్స్..!

భారత క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విజయంలో కీలక పాత్రతో కెరీర్‌ను మొదలుపెట్టిన స్నిన్‌ మాయావి హర్భజన్‌ సింగ్‌.. 23ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికాడు.

Updated : 25 Dec 2021 11:08 IST

రాజకీయాల కోసమే క్రికెట్‌కు వీడ్కోలు పలికారా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత స్పిన్‌ మాయావి హర్భజన్‌ సింగ్‌.. 23ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించి ఆటకు పూర్తిగా వీడ్కోలు చెప్పాడు. మరి భజ్జీ భవిష్యత్‌ కార్యాచరణ ఏంటీ..? రాజకీయ నాయకుడిగా కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాడా? పాలిటిక్స్‌ కోసమే రిటైర్మెంట్‌ ప్రకటించాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది..!

హర్భజన్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం సాగుతున్నా.. ఆ వార్తలను టర్బోనేటర్‌ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వచ్చాడు. అయితే మరికొద్ది నెలల్లో అతడి సొంత రాష్ట్రమైన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అటు భాజపాకు.. ఇటు అధికార కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో ఈ రెండు పార్టీలు జనాకర్షక నేతలపై గట్టిగా దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే హర్భజన్‌ను తమ పార్టీలోకి తీసుకోవాలని ఇరుపక్షాలు బలంగా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు వారాల క్రితం భజ్జీ భాజపాలో చేరుతారనే కథనాలు కూడా వచ్చాయి. అయితే వాటిని హర్భజన్‌ ఖండించారు. అది ఫేక్‌ న్యూస్‌ అని ట్వీట్‌ చేశాడు. అయితే రాజకీయాల్లోకి రావట్లేదని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. 

సిద్ధూతో భేటీ.. ఆంతర్యమేంటీ?

ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసేలా ఇటీవల హర్భజన్‌.. పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూతో భేటీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సిద్ధూ తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘‘సాధ్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్న ఫొటో’’ అని రాసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో భజ్జీ చేరిక ఖాయమనే వార్తలు వినిపించాయి. అయితే వీటిని హర్భజన్‌ ఖండించకపోవడం కూడా ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చినట్లయింది.

సిద్ధూతో భేటీ జరిగిన సరిగ్గా 10 రోజుల తర్వాత భజ్జీ.. గురువారం క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దీంతో రాజకీయాల కోసమే ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. ‘‘ఇటీవల హర్భజన్‌.. సిద్ధూతో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై ఆయన ఆసక్తిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లోనే నిలబెట్టాలని భావిస్తోంది’’ అని కాంగ్రెస్‌ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇక, గత రెండు రోజులుగా సిద్ధూ.. భజ్జీతో టచ్‌లోనే ఉన్నారట. చండీగఢ్‌లోని సిద్ధూ స్నేహితుడి నివాసంలో త్వరలోనే వీరిద్దరూ మరోసారి భేటీ కానున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతోనూ భజ్జీ సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలిపాయి. అవే నిజమైతే వచ్చే ఎన్నికల్లో హర్భజన్‌ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పోటీ అక్కడి నుంచేనా..!

భజ్జీ స్వస్థలం జలంధర్. ఇది దోబా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎక్కువ. ప్రస్తుతం అక్కడ బలంగా ఉన్న శిరోమణి అకాలీదళ్‌.. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దీంతో ఈ కూటమిని ఎదుర్కొనేందుకు భజ్జీని రంగంలోకి దింపాలని కాంగ్రెస్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ భజ్జీ అంగీకరిస్తే నకోదార్‌ అసెంబ్లీ నుంచి అతడిని పోటీకి నిలబెట్టాలని చూస్తోంది. లేదా.. ఈ ప్రాంతంలో ప్రచారకర్తగా ఉపయోగించుకునే అవకాశాలున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి భజ్జీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడో చూడాలి..! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని