
S-400: భారత్‌పై కాట్సా ప్రయోగించొద్దని ఇంకా నిర్ణయించలేదు: అమెరికా
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనడంపై అమెరికా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ‘ఆంక్షల ద్వారా అమెరికా ప్రత్యర్థుల్ని నిరోధించే చట్టం (సీఏఏటీఎస్ఏ-కాట్సా)’ అస్త్రాన్ని మన దేశంపై ప్రయోగించొద్దన్న కచ్చితమైన నిర్ణయానికి మాత్రం రాలేదని అధ్యక్షుడు బైడెన్ వర్గం ప్రకటించింది.
వారం క్రితం నుంచి భారత్‌కు ఎస్-400 క్షిపణి వ్యవస్థల సరఫరా ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో అమెరికాలో పలువురు కీలక చట్టసభ సభ్యులు భారత్‌పై కాట్సా ప్రయోగించొద్దని అధ్యక్షుణ్ని కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అధ్యక్ష వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధానికి తాము విలువిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మంగళవారం తెలిపారు. అయితే, భారత్ ఒక్కటే కాకుండా ఇతర ఏ దేశమైనా రష్యాతో రక్షణ వ్యాపార లావాదేవీలు జరపొద్దనేదే తమ అభిమతమని స్పష్టం చేశారు. ఒక దేశానికి మినహాయింపునిచ్చే వెసులుబాటు కాట్సాలో లేదని తెలిపారు.
భారత్ తమకు ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉందని నెడ్ ప్రైస్ తెలిపారు. ఈ మధ్య కాలంలో ఈ బంధం మరింత బలోపేతమైందన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని తాము ఆశిస్తున్నామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పలుసార్లు చర్చించామన్నారు. పలువురు అమెరికన్ చట్టసభ సభ్యులు కూడా ఈ విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. దీనిపై భారత వర్గాలతో చర్చలు కొనసాగుతాయన్నారు. త్వరలో 2+2 చర్చలు కూడా ఉంటాయన్నారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్-400 ట్రయంఫ్ ఒకటి. డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లతో పాటు యుద్ధ విమానాల దాడుల నుంచి అది రక్షణ కల్పిస్తుంది. తనవైపు దూసుకొచ్చే శత్రు దేశాల ఆయుధాలను క్షిపణుల ప్రయోగంతో కూల్చివేస్తుంది. ప్రధానంగా చైనా, పాకిస్థాన్లతో పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణ ఛత్రంగా పని చేస్తుందన్న ఉద్దేశంతో భారత్ దీని కొనుగోలుకు నిర్ణయించింది. అయిదు ఎస్-400 వ్యవస్థల సముపార్జన కోసం 2018 అక్టోబరులో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
► Read latest Business News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.