Modi-Tedros: డబ్ల్యూహెచ్‌ఓ అధినేతకు గుజరాతీ పేరుపెట్టిన మోదీ.. ఏంటో తెలుసా?

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్‌ అథనామ్‌కు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.......

Updated : 20 Apr 2022 20:43 IST

గాంధీనగర్‌: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్‌ అథనామ్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తనకు ఓ గుజరాతీ పేరు పెట్టాలని మోదీని అథనామ్‌ కోరగా.. ఆయనకు ‘తులసీభాయ్‌’గా పేరుపెట్టారు. ఆ పేరుతో పిలవడాన్ని ఆస్వాదిస్తున్నట్లు మోదీ తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను డబ్ల్యూహెచ్‌ఓ అధినేతతో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ నాకు మంచి మిత్రుడు. తనకు భారతీయ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పారని, వారి కారణంగానే తాను ఈ స్థానంలో ఉన్నట్లు నాతో అన్నారు. తాను గుజరాతీలా మారిపోయానని, తనకు ఓ పేరు సూచించాలని నన్ను కోరారు. అందుకే ఆయన్ను గుజరాతీ పేరు అయిన తులసీభాయ్‌ పేరుతో పిలుస్తున్నా’’ అని మోదీ పేర్కొన్నారు. తులసి ఓ మొక్క పేరు అని, భారత్‌లోని ఎన్నో తరాలు ఆ మొక్కను పూజించాయని గుర్తుచేశారు.

ఆయుష్‌ థెరపీ, సంప్రదాయ వైద్య సేవల నిమిత్తం భారత్‌కు రావాలనుకునే విదేశీ పౌరుల కోసం త్వరలో ప్రత్యేక ఆయుష్ వీసా కేటగిరీని ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రత్యేక ఆయుష్‌ హాల్‌మార్క్‌ను కూడా రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఆయుష్‌ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు అపరిమిత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఉత్పత్తిలో ఆయుష్ ఔషధాలు, సౌందర్య సాధనాలు దూసుకుపోతున్నాయన్నారు.

అంతకుముందు జామ్‌నగర్‌లో ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనాన్ని టెడ్రోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుజరాతీలో మాట్లాడి సభికులను ఆశ్చర్యపర్చారు. తన ప్రసంగాన్ని ప్రారంభించేముందు అక్కడ హాజరైనవారందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి పలకరించారు. ‘అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు?’ అంటూ గుజరాతీ భాషలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ఆయన మాటలకు ప్రధాని చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని