
Boat Accident: కళ్లముందే తిరగబడ్డ పడవ.. ప్రయాణికుల హాహాకారాలు
గువాహటి: నదీ ప్రవాహంతో హాయిగా సాగిపోతున్న ఆ ప్రయాణంలో ఒక్కసారిగా ఓ కుదుపు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారు ప్రయాణిస్తున్న పడవ ఒకవైపుకు ఒరగడం మొదలైంది. కళ్లముందు మృత్యువు సమీపిస్తుంటే భయంతో హాహాకారాలు చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు నీటిలోకి దూకేశారు. బ్రహ్మపుత్ర నదిలో బుధవారం చోటుచేసుకున్న పడవ ప్రమాదంలో భయానక దృశ్యాలివి..!
అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ జిల్లాలో నిన్న ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. బ్రహ్మపుత్ర నదిలో బుధవారం 120 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తోన్న భారీ పడవ ఒకటి నిమతీఘాట్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఫెర్రీని ఢీకొంది. సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 87 మందిని కాపాడగా.. ఒక మహిళ మృతిచెందినట్లు తెలిసింది. గల్లంతైన వారికోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
ఘటన జరిగిన సమయంలో పడవలో దృశ్యాలను కాంగ్రెస్‌కు చెందిన అసంఘటిత కార్మికుల సంఘం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఫెర్రీని ఢీకొట్టగానే పడవ ఓవైపుకు ఒరిగింది. దీంతో అందులోని ప్రయాణికులు భయంతో డెక్‌పై పరుగులు పెట్టారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు నీటిలోకి దూకేశారు. చూస్తుండగానే పడవ పూర్తిగా తిరగబడింది.
‘‘మునిగిపోయిన తర్వాత పడవ 1.5 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. ఇసుక దిబ్బలో తలకిందులుగా కూరుకుపోయింది. ఒక్కసారి దానిని పూర్వపు స్థితికి తీసుకొస్తే.. పడవ కింద ఎవరైనా చిక్కుకుని మరణించారా? అన్న సంగతి తెలుస్తుంది’’ అని జోర్హాట్ డిప్యూటీ కమిషనర్ అశోక్ బర్మాన్ తెలిపారు.